లక్డీకపూల్‌లోని రంగారెడ్డి కలెక్టరేట్లో రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి జాతీయ పథకాన్ని ఆవిష్కరించి.. ఆచార్య జయశంకర్ చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం మంత్రితో పాటు రంగారెడ్డి జిల్లా జడ్పీ ఛైర్మన్ తీగల అనిత రెడ్డి, కలెక్టర్ అమయ్ కుమార్ రెడ్డి పాల్గొని జాతీయ గీతాన్ని ఆలపించారు. అంతకుముందు సరూర్ నగర్ స్టేడియంలో అమర వీరుల స్మారక చిహ్నానికి చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డితోపాటు పూలమాల వేసి నివాళులర్పించారు. పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించారు.
రంగారెడ్డి జిల్లా రైతులు గర్వపడేలా పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని తెలంగాణ ప్రభుత్వం పూర్తి చేసి తీరుతుందని మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. జిల్లా మహిళా సమాఖ్య సభ్యులకు రూ. 20 కోట్ల 62 లక్షల 80 వేల చెక్కులను అందజేశారు.
"ఆరు సంవత్సరాల తర్వాత రాష్ట్రాన్ని చూసుకుంటే.. దేశానికే అన్నం పెట్టే దిశగా తెలంగాణ రైతన్న ఎదుగుతున్నాడు. అది నిజంగా చాలా గర్వకారణం. అన్నదాత కృషి, ప్రభుత్వ సహకారంతోనే ఇది సాధ్యమైంది. మన రంగారెడ్డి జిల్లా ప్రజల ఆకాంక్ష అయినా పాలమూరు-రంగారెడ్డి పథకం పూర్తవ్వాలని కోరుకుందాం."
-సబితా ఇంద్రారెడ్డి, మంత్రి
ఇవీ చూడండి: పోరాటాల తెలంగాణలో సంస్కరణల పాలన