ముఖ్యమంత్రి కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా మంత్రి సత్యవతి రాఠోడ్ మొక్కలు నాటారు. రంగారెడ్డి జిల్లా హయత్‌నగర్‌లోని గిరిజన గురుకుల విద్యాలయంలో విద్యార్థులతో కలిసి కోటి వృక్షార్చనలో పాల్గొన్నారు. కేక్ కట్ చేసి.. ముఖ్యమంత్రికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం విద్యార్థినులతో కలిసి అల్పాహారం చేశారు. భోజన వసతులపై విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా విద్యాలయంలోని కంప్యూటర్ ల్యాబ్, లైబ్రరీ, వెల్నెస్ సెంటర్లను పరిశీలించారు. విద్యార్థినులకు నూతన దుస్తులు, బ్యాగులను పంపిణీ చేశారు.
కోటి వృక్షార్చన సందర్భంగా గిరిజన సంక్షేమ శాఖలో 2 లక్షల మొక్కలు నాటుతున్నట్లు మంత్రి వివరించారు. దేశంలో ఎక్కడా లేని విధంగా గిరిజన తెగలకు ఉత్తమ విద్య, నాణ్యమైన భోజనం అందిస్తున్నామని తెలిపారు. గిరిజన గురుకుల పాఠశాలల్లో చదువుకునే విద్యార్థులు.. అన్ని పోటీ పరీక్షల్లో తమ ప్రతిభ చాటుతూ రాష్ట్ర ప్రతిష్ఠను పెంచుతున్నారన్నారు. కార్యక్రమంలో గిరిజన గురుకులాల ఉప కార్యదర్శి నవీన్ నికోలస్, అధికారులు విజయ లక్ష్మి, కల్యాణి, అరుణ శ్రీ, చెంగల రవీందర్ గౌడ్, తదితరులు పాల్గొన్నారు.