Sabitha indrareddy: పేదల కోసం ముఖ్యమంత్రి అహర్నిశలు కృషి చేస్తుంటే.. మోదీ ప్రభుత్వం వారి పాలిట శాపంగా మారిందని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి విమర్శించారు. గ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరలు పెంచుతూ ప్రజలపై పెను భారం మోపుతోందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అన్ని వర్గాల అభివృద్ధే లక్ష్యంగా పని చేస్తోందని తెలిపారు. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం మన్సాన్పల్లిలో డ్వాక్రా భవన నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం ఓపెన్ జిమ్, తెలంగాణ క్రీడా మైదానం ప్రారంభించారు. అంతకుముందు ఎస్సీ కమ్యూనిటీ హాల్ వద్ద బాబాసాహెబ్ డాక్టర్ బీఆర్ అంబేడ్కర్, బాబు జగ్జీవన్రామ్ల విగ్రహాలకు పూల మాలలు వేసి నివాళులర్పించారు.
మహిళలు రుణాలు తీసుకుని చిరు వ్యాపారాలు చేసుకునేలా ప్రోత్సహించాలనే ఉద్దేశంతో రూ.లక్ష నుంచి రూ.3 లక్షల వరకు రుణాలు అందిస్తున్నామని సబితా తెలిపారు. ధరలపై మహిళలు నిలదీస్తారని భాజపా సభకు రాకుండా జాగ్రత్త పడ్డారని అన్నారు. కేంద్రం గ్యాస్‌పై పెంచిన ధరలు వెంటనే తగ్గించాలని డిమాండ్ చేశారు. పెట్రోల్, డీజిల్ ధరలతో నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయని విమర్శించారు.
రైతు బంధు ద్వారా ఎకరాకు 10 వేల రూపాయలు ఇస్తున్న ప్రభుత్వం మనదని.. గుంట భూమి ఉన్న రైతు చనిపోతే కూడా రూ.5 లక్షల బీమా అందిస్తున్నామని తెలిపారు. కల్యాణ లక్ష్మీ, షాది ముబారక్ పథకాల ద్వారా పేదింటి అడబిడ్డల పెళ్లిళ్లకు లక్ష రూపాయల అందిస్తున్నట్లు తెలిపారు. రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్, విత్తనాలు, ఎరువులు అందుబాటులో ఉంచుతున్నట్లు వెల్లడించారు. రూ.20 లక్షలతో గ్రామంలో డ్వాక్రా భవనం నిర్మాణానికి శంకుస్థాపన చేయటం సంతోషంగా ఉందని, మహిళ సంఘాలు ఆర్థికంగా బలపడాలని ఆకాంక్షించారు. మన్సాన్పల్లి గ్రామంలో ఏడేళ్లలో 30 మహిళ సంఘాలకు రూ.12.43 లక్షలు ఇవ్వటం జరిగిందని తెలిపారకు. గురుకులాల ద్వారా నాణ్యమైన ఉచిత విద్య అందిస్తూ ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి కృషి చేస్తున్నామని.. విద్యార్థులకు ఉచితంగా బుక్స్, యూనిఫామ్, సన్న బియ్యంతో భోజనం, ఆంగ్ల మాధ్యమం అందిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో జడ్పీ ఛైర్ పర్సన్ అనిత రెడ్డి, ఎంపీపీ రఘుమా రెడ్డి, అధికారులు, నాయకులు పాల్గొన్నారు.
ఇవీ చదవండి: కాంగ్రెస్ వర్సెస్ భాజపా.. పోటాపోటీ నిరసనలు