రాష్ట్రంలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తున్నాయని మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. రైతు బీమా, కల్యాణలక్ష్మి, మిషన్ భగీరథ, మిషన్ కాకతీయతో పాటు ఎన్నో పథకాలు రాష్ట్రంలో అమలవుతున్నాయని తెలిపారు. తెరాస ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకుపోవాలని కార్యకర్తలకు సూచించారు. నిరంతరం పార్టీ కోసం పనిచేసే కార్యకర్తలకు తగిన గుర్తింపు ఉంటుందని మహేశ్వరం నియోజకవర్గ తెరాస కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశంలో మంత్రి పేర్కొన్నారు.
తెరాస ఆవిర్భవించి 20 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా వచ్చే నెల 15న వరంగల్‌లో జరిగే విజయగర్జన సభకు నియోజకవర్గం నుండి కార్యకర్తలు భారీగా తరలిరావాలని కోరారు. నవంబర్ 15న 8గంటల వరకు ప్రతి గ్రామంలో, డివిజన్‌లో పార్టీ జెండా ఎగురవేసి సభకు బయలుదేరుదామని తెలిపారు. ప్రతి బస్‌లో 50 మంది ముఖ్య కార్యకర్తలు వచ్చేలా చూడాలని పేర్కొన్నారు. కార్లలో వద్దు... అందరం బస్‌లలోనే వెళదామని తెలిపారు. నేను కూడా బస్‌లోనే వస్తానని సబితా ఇంద్రారెడ్డి అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి, రంగారెడ్డి జిల్లా పరిషత్ ఛైర్ పర్సన్ అనిత హరినాథ్ రెడ్డి, రాష్ట్ర గ్రంధాలయ ఛైర్మన్ శ్రీధర్, జిల్లా గ్రంథాలయ ఛైర్మన్ పాండురంగా రెడ్డి, బడంపేట్ మేయర్ చిగురింత పారిజాత, ఇతర ప్రజా ప్రతినిధులు, తెరాస నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
ఇదీ చదవండి: Ktr France tour: డిజిటల్ సాంకేతికతలో అద్భుతాలు.. ఫ్రాన్స్, తెలంగాణ పరస్పర సహకారం