విక్టోరియా మెమోరియల్ హోంలోని విద్యార్థులకు ఏ లోటు రాకుండా అవసరమైన చర్యలు తీసుకోవాలని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆదేశించారు. విద్యార్థులను కంటికి రెప్పలా చూసుకోవడంతో పాటు ఎప్పటికప్పుడు ఆక్సిజన్, జ్వరం స్థాయిలను పరీక్షిస్తూ వైద్యులు నిరంతరం పర్యవేక్షించాలని మంత్రి తెలిపారు. సరూర్‌నగర్‌లోని విక్టోరియా మెయోరియల్ హోంలోని 16 మంది విద్యార్థులకు కరోనా పాజిటివ్ వచ్చినట్లు సమాచారం అందుకున్న మంత్రి సబితా ఇంద్రారెడ్డి హోం విద్యార్థులను పరామర్శించారు.
జూమ్ ద్వారా స్కూల్ ప్రిన్సిపల్, ఉపాధ్యాయులు విద్యార్థులతో మంత్రి మాట్లాడారు. ఎట్టి పరిస్థితుల్లోనూ అదైర్యపడవద్దని తొందరలోనే కోలుకుంటారని ధైర్యం చెప్పారు. ఈ సందర్భంగా మంత్రి విద్యార్థులను అప్యాయంగా పలకరించి వారి ఆరోగ్య పరిస్థితిని, అందుతున్న వైద్య సేవలు సదుపాయాలను అడిగి తెలుసుకున్నారు. స్కూల్‌లో ఐసోలేషన్‌లో ఉన్నవారిని జాగ్రత్తగా చూసుకోవాలని అవసరమైతే ఆస్పత్రికి తరలించేందుకుగాను అంబులెన్స్‌ను అందుబాటులో ఉంచుకోవాలని సబితా ఇంద్రారెడ్డి సూచించారు.