పాఠ్య పుస్తకాల పంపిణీలో ప్రజా ప్రతినిధులు భాగస్వాములు కావాలని విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి పిలుపునిచ్చారు. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం కౌకుంట్లలో 30 లక్షల రూపాయల జడ్పీ నిధులతో నిర్మించనున్న అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులకు మంగళవారం శంకుస్థాపన చేశారు.
రేపటి నుంచి ప్రారంభమయ్యే... పాఠ్య పుస్తకాల పంపిణీలో గౌరవ శాసన సభ్యులు, ఎంపీలు, జడ్పీ ఛైర్పర్సన్లు, ఎమ్మెల్సీలు, ఎంపీపీ, జడ్పీటీసీలు, సర్పంచ్లు, విద్యా కమిటీ ఛైర్మన్లు తదితరులు పాల్గొని పంపిణీ చేయాలని సూచించారు.
ఈ నెల 22 నుంచి 26 వరకు జరిగే పంపిణీ కోసం ఇప్పటికే పుస్తకాలను ప్రధానోపాధ్యాలకు, విద్యా కమిటీలకు అప్పజెప్పినట్లు మంత్రి తెలిపారు. కొవిడ్ మార్గదర్శకాలను అనుసరించి అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
గ్రామాల అభివృద్ధికి ముఖ్యమంత్రి కేసీఆర్ కృషి చేస్తున్నారని, ప్రతినెలా 339 కోట్ల నిధులు నేరుగా పంచాయతీలకు విడుదల చేస్తున్నారని వివరించారు. ప్రణాళిక బద్దంగా గ్రామాల అభివృద్ధి జరుగుతుందని మంత్రి పేర్కొన్నారు.
ప్రతి గ్రామంలో నర్సరీ, డంపింగ్ యార్డ్, వైకుంఠదామలు ఉండేలా ప్రభుత్వం చర్యలు తీసుకుందని చెప్పారు. తాజాగా గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ప్రకృతి వనం ఉండేలా ఆదేశాలు ఇచ్చారని ఆ దిశగా రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాలలో ఇప్పటికే స్థలాల ఎంపిక పూర్తి అయిందని మంత్రి వెల్లడించారు.హరితహారం సందర్భంగా గ్రామాల్లో పెద్ద ఎత్తున మొక్కలు నాటడం జరిగిందని తెలిపారు.
ఇదీ చదవండి: నీటిపారుదల శాఖ జలవనరుల శాఖగా మార్పు: సీఎం కేసీఆర్