బాలబాలికలకు ఉత్తమ విద్యను అందించాలనే సేవాభావంతో ఏర్పాటు చేసిన విక్టోరియా మెమోరియల్ పాఠశాల అభివృద్ధికి అన్ని చర్యలు తీసుకుంటామని సంక్షేమశాఖమంత్రి కొప్పుల ఈశ్వర్ తెలిపారు. విక్టోరియా మెమోరియల్ హోం అండ్ ఇండస్ట్రీయల్ స్కూల్ ఎగ్జిబిక్యూటివ్ కమిటీ సభ్యులతో ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. మూడు గంటల పాటు సాగిన ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ప్రతి ఉపాధ్యాయుడు సేవభావంతో బాలబాలికలకు చక్కటి విద్యతోపాటు నైతిక విలువలు నేర్పాలని మంత్రి సూచించారు.
చరిత్రాత్మకమైన విక్టోరియా మెమోరియల్‌ను అత్యుత్తమ విద్యా కేంద్రంగా తీర్చిదిద్దుతామని మంత్రి స్పష్టం చేశారు. పాఠశాలకు చెందిన భూమి అన్యాక్రాంతం చుట్టూ ఫెన్సింగ్ ఏర్పాటు చేస్తామన్నారు. పదో తరగతి పూర్తి చేసుకున్న వారికి ఇంటర్, డిగ్రీ గురుకుల విద్యాలయాల్లో ప్రవేశపరీక్ష లేకుండా నేరుగా ప్రవేశాలు కల్పిస్తామని వెల్లడించారు. ఉపాధ్యాయులు, విద్యార్థులు, పూర్వవిద్యార్థులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. తరగతులు, హాస్టళ్లు, పరిసరాలను పరిశీలించిన మంత్రి అధికారులకు పలు సూచనలు చేశారు. బాలబాలికలకు ఆంగ్లభాషలో పట్టు, ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని సూచించారు. ఆసక్తి ఉన్న వారికి వృత్తి విద్యా కోర్సులలో శిక్షణ, వ్యక్తిత్వ వికాసంపై నిపుణులతో అవగాహన కల్పించేందుకు చర్యలు తీసుకోవాలని మంత్రి పేర్కొన్నారు. ఈ సమావేశంలో ఎస్సీ అభివృద్ధి శాఖ ముఖ్యకార్యదర్శి విజయ్ కుమార్, కమిషనర్ యోగితారాణా, జాయింట్ సెక్రటరీ శ్రీనివాస్‌రెడ్డి, ప్రిన్సిపాల్ సుహాసిని, అధికారులు పాల్గొన్నారు.