Harish Rao Visited Shanthivanam: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి కేంద్రానికి తలవంచి శ్రీకాకుళం జిల్లాలో బోరుబావుల వద్ద మీటర్లు పెట్టారని మంత్రి హరీశ్‌రావు అన్నారు. మన రాష్ట్రంలో సీఎం కేసీఆర్ మీటర్లు పెట్టేందుకు అంగీకరించకపోవడంతో ఎఫ్‌ఆర్‌బీఎం(ఫిస్కల్ రెస్పాన్సిబిలిటీ అండ్ బడ్జెట్ మేనేజ్‌మెంట్) కింద రాష్ట్రానికి రూ.5 వేల కోట్లు కోత వేశారని చెప్పారు. ఏపీకి మొత్తంగా రూ.7 వేల కోట్ల మేర ప్రయోజనం చేకూరనుందన్నారు. సిద్దిపేటలో చిన్నకోడూరు మండల ప్రజాప్రతినిధులతో ఆదివారం మంత్రి సమావేశం నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వం విద్యుత్తు చట్టంలో సంస్కరణలు తేవాలంటూ రాష్ట్రాల మెడలపై కత్తి పెడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఏడేళ్లుగా రాష్ట్ర ప్రభుత్వం 24 గంటల నాణ్యమైన ఉచిత విద్యుత్తును వ్యవసాయానికి అందిస్తోందన్నారు. అందుకు ఏటా రూ.12 వేల కోట్లు ఖర్చు చేస్తోందన్నారు. భాజపా ఎవరికీ ఏమీ ఇవ్వడం లేదని, పైగా ఇచ్చే దాంట్లోనే కోతలు పెడుతోందన్నారు. గ్యాస్ రాయితీ తగ్గించి.. ఎరువులు, యూరియా ధరలు పెంచిందన్నారు. భాజపా సోషల్ మీడియా తప్పుడు ప్రచారాన్ని సమష్టిగా తిప్పికొట్టాలన్నారు. భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సహా నాయకులు తెరాసపై ఏడుస్తున్నారన్నారు. ఆ పార్టీ అధికారంలో ఉన్న ఏ రాష్ట్రమూ బాగుపడ్డ దాఖలాలు లేవన్నారు.
శ్రీరామచంద్ర మిషన్ రాష్ట్రానికి గర్వకారణం..
శ్రీరామచంద్ర మిషన్‌ను స్థానికంగా ఏర్పాటు చేయడం రాష్ట్రానికే గర్వకారణమని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు అన్నారు. రంగారెడ్డి జిల్లా నందిగామ మండలం కన్హలోని శ్రీరామచంద్ర మిషన్(కన్హ శాంతి వనం)లో కన్హ మెడికల్ సెంటర్‌ను శ్రీరామచంద్ర మిషన్ గ్లోబల్ గైడ్ కమలేష్ డి పటేల్(దాజీ)తో కలిసి ఆదివారం మంత్రి ప్రారంభించారు. అంతకు ముందు దాజీతో కలిసి ధ్యానం చేశారు. మెడికల్ సెంటర్‌లో 12 పడకలతో ప్రతిరోజు 24 గంటలూ అత్యాధునిక వైద్య సేవలు కొనసాగించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.
ఇదీ చదవండి: Rahul Gandhi Tour: రాహుల్ సభకు భారీ జనసమీకరణపై కాంగ్రెస్ దృష్టి!
లతామంగేష్కర్ అవార్డ్ అందుకున్న ప్రధాని.. దేశప్రజలకు అంకితం