Rain alert in Telangana: రాష్ట్రంలో రాగల మూడ్రోజులు ఉరుములు మెరుపులతో కూడిన తేలిక పాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. మూడు రోజుల ముందుగానే నైరుతి రుతుపవనాలు ఈ రోజు కేరళ తీరాన్ని తాకి, లక్ష ద్వీపాల్లోకి ముందుగానే ప్రవేశించాయని వెల్లడించింది. రాగల రెండు, మూడు రోజుల్లో కేరళలోని మిగిలిన ప్రాంతాలు, తమిళనాడు, కర్ణాటక, దక్షిణ మధ్య బంగాళాఖాతం ఈశాన్య రాష్ట్రాల్లోని మరికొన్ని ప్రాంతాల్లోకి రుతుపవనాల ప్రవేశానికి అనుకూల పరిస్థితులు ఏర్పడుతున్నాయని వాతావరణ కేంద్రం వివరించింది.
ఇటీవల బంగాళాఖాతంలో ఏర్పడిన అసని తుఫాను కారణంగా గత నెల నుంచి రుతుపవనాల్లో వేగం పెరిగిందని.. వాతావరణ శాఖ అధికారులు పేర్కొన్నారు. నైరుతి రుతుపవనాల ప్రభావంతో ఈ ఏడాది సాధారణ వర్షపాతం నమోదవుతుందని ఐఎండీ గతంలో వెల్లడించింది. నైరుతి రుతుపవనాలు సాధారణంగా జూన్ 1న కేరళ తీరాన్ని తాకుతాయి. అయితే, ఈసారి ముందుగానే అవి వస్తున్నట్టు వాతావరణ శాఖ ఇటీవల వెల్లడించింది. మే 27నే ఇవి కేరళకు చేరుకుంటాయని అంచనా వేసింది. అయితే, చెప్పిన సమయానికి నాలుగు రోజులు తేడా ఉండే అవకాశం ఉందని తెలిపింది.
ఇవీ చదవండి: గుడ్న్యూస్.. మూడు రోజులు ముందే వచ్చిన రుతుపవనాలు
22 మందితో వెళ్తూ విమానం మిస్సింగ్.. పావు గంట ప్రయాణం కోసం ఎక్కితే...