Daifuku Factory at chandanvelly Hyderabad : జపాన్‌కు చెందిన రెండు ప్రసిద్ధ సంస్థలు రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలం చందన్‌వెల్లిలో రూ. 575 కోట్లతో పరిశ్రమలను నెలకొల్పనున్నాయి. డైఫుకు సంస్థ యంత్ర పరికరాల తయారీ పరిశ్రమ, నికోమాక్ తైకిషా పరిశుభ్రత పరికరాల తయారీ పరిశ్రమలను ఏర్పాటు చేయనున్నాయి. ఈ క్రమంలో ఇవాళ.. డైఫుకు, నికోమాక్ తైకిషా కంపెనీల కొత్త ఫ్యాక్టరీల శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించారు. తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు.
Japan companies in Telangana : అతి తక్కువ సహజ వనరులు అందుబాటులో ఉన్నా.. అద్భుతమైన దేశంగా జపాన్ ఎదిగిందని ఐటీ మంత్రి కేటీఆర్ ప్రశంసించారు. ప్రకృతి వైపరీత్యాలు పదేపదే సవాళ్లు విసిరినా.. ఎదుర్కొని జపాన్ తిరిగి నిలబడిందన్నారు. రూ. 575 కోట్ల పెట్టుబడితో డైఫుకు, నికోమాక్ తైకిషా సంస్థల ద్వారా ప్రత్యక్షంగా 16 వందల మందికి ఉపాధి కల్పించనున్నట్లు కేటీఆర్ తెలిపారు. స్థానికంగా ఉన్న ఐటీఐని దత్తత తీసుకొని స్థానికులకే ఉద్యోగాలు దక్కేలా కంపెనీలు హామీ ఇచ్చాయని ఆయన తెలిపారు. ఈ కంపెనీలలో వచ్చే ఉద్యోగాలకు అవసరమైన శిక్షణను కూడా అందించనున్నాయని పేర్కొన్నారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేలా జపాన్ క్లస్టర్‌ను ఏర్పాటుచేయాలని మంత్రి కేటీఆర్ విజ్ఞప్తి చేశారు.
'127 మిలియన్ జనాభా ఉన్న దేశం జపాన్. సునామీ, భూకంపాలు చాలా ఎక్కువగా వచ్చే ప్రదేశం. హిరోషిమా, నాగసాకి విధ్వంసం నుంచి జపాన్ తేరుకున్న విధానం ప్రశంసనీయం. మన దేశంలో ఎవరి ఇంట్లో చూసినా... ఏదో ఒక జపాన్ ఉత్పత్తి ఉంటుంది. డైఫుకు.. భారత్‌లో అగ్రగామిగా నిలుస్తుందని భావిస్తున్నాను. డైఫుకు సంస్థ.. రూ.575 కోట్ల పెట్టుబడి పెడుతోంది. చందన్‌వెల్లికి వెల్‌స్పన్, మైక్రోసాఫ్ట్, ఇతర సంస్థలు వస్తున్నాయి. సెప్టెంబరులో ఈ ఫ్యాక్టరీని ప్రారంభిస్తారు.' - కేటీఆర్, ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి
KTR on Japan companies in Telangana : చందన్వెల్లి పారిశ్రామిక పార్కు కోసం స్థానిక నాయకులు, స్థానిక ప్రజలు ఇచ్చిన సహకారం వల్లనే పెద్ద ఎత్తున కంపెనీలు ఇక్కడికి వస్తున్నాయని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రంలో అత్యంత కీలకమైన పారిశ్రామికవాడగా చందన్వెల్లి ఎదుగునుందన్న కేటీఆర్... జపాన్ నుంచి మరిన్ని పెట్టుబడులు వచ్చేలా ఇందుకు అవసరమైన సహకారాలను జపాన్ కాన్సులేట్ నుంచి ఇవ్వాలని కోరారు. తెలంగాణలో పెట్టుబడి పెట్టేందుకు డైఫుకు సంస్థ ముందుకు వచ్చినందుకు ఆనందంగా ఉందని మంత్రి కేటీఆర్ అన్నారు. ఈ కార్యక్రమంలో ఇరు సంస్థల జాపనీస్ ప్రతినిధులు, తెలంగాణ పరిశ్రమలు, ఐటీ శాఖల ముఖ్యకార్యదర్శి జయేశ్‌రంజన్, తదితరులు పాల్గొన్నారు.
ఇవీ చదవండి :