రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం డివిజన్ పరిధిలోని ప్రభుత్వ ఆసుపత్రుల వద్ద కొవిడ్ అనుమానితులు బారులు తీరారు. మంచాల, ఆరుట్ల, యాచారం, ఇబ్రహీంపట్నం, మాడ్గుల, ఎలిమినేడు, దండుమైలారంలోని ఆసుపత్రుల వద్ద కరోనా పరీక్షల కోసం అనుమానితులు భారీగా బారులు తీరారు. వ్యాక్సిన్ వేసుకునేందుకు వచ్చిన వారు కూడా ఎండలో గంటల తరబడి నిలబడాల్సి వస్తోంది.
స్లాట్ బుకింగ్ చేసుకున్న సమయానికి టీకా అందక.. గంటల తరబడి ఎండలో నిల్చోవలసి వస్తోందని ప్రజలు వాపోతున్నారు. కనీస సౌకర్యాలు లేకపోవడం వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. వ్యాక్సిన్ తీసుకోవడానికి వచ్చిన వారు కొవిడ్ నిబంధనలు పాటించడం లేదు. వీరికి అవగాహన కల్పించే సిబ్బంది కూడా లేరు.