Local body mlc elections telangana 2021: స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్ల సందర్భంగా రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్(Rangareddy collectorate issue) ముందు ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. నామినేషన్ల గడువు చివరి నిమిషం వరకు ఇదే ఉద్రిక్తత కొనసాగింది. తెరాస అభ్యర్థులు శంభీపూర్ రాజు, పట్నం మహేందర్ రెడ్డి(trs candidates nominations for Local body mlc elections) మంగళవారం నామ పత్రాలు సమర్పించారు. వారికి మద్దతుగా తెరాస శ్రేణులు భారీగా తరలివచ్చారు. ఈ నేపథ్యంలో నామినేషన్ వేసేందుకు వచ్చిన స్వతంత్ర అభ్యర్థులను తెరాస నాయకులు, కార్యకర్తలు అడ్డుకున్నారు. ఇండిపెండెంట్ అభ్యర్థుల నామినేషన్ పత్రాలను చింపివేశారు. ఈ క్రమంలో ఇరువర్గాల మధ్య ఘర్షణ తలెత్తగా... పోలీసులు లాఠీఛార్జ్(lathi charge by police) చేసి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు.
'పట్నం మహేందర్ పీఏ దౌర్జన్యం'
తెరాస ఎమ్మెల్సీ అభ్యర్థి పట్నం మహేందర్ పీఏ మల్లారెడ్డి, ఆయన అనుచరులు దౌర్జన్యం చేశారని స్వతంత్ర అభ్యర్థులు ఆరోపించారు. ఇండిపెండెంట్ అభ్యర్థిగా నామినేషన్ వేయడానికి వచ్చిన తన నామినేషన్ పత్రాలను లాక్కొని... చించేసి వీరంగం చేశారని చంద్రశేఖర్ అనే వ్యక్తి తెలిపారు. ఈ ఘటనను వీడియో తీస్తున్న మీడియాపై దాడి చేశారని కూడా వాపోయారు.
అభ్యర్థుల నిరసన
పోలీసులను అడ్డంపెట్టుకొని గెలవాలని తెరాస ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఎంపీటీసీల సంఘం రాష్ట్ర మహిళ అధ్యక్షురాలు చింపుల శైలజ సత్యనారాయణ రెడ్డి ఆరోపించారు. తమ ఎంపీటీసీల సమస్యల పరిష్కారం కోసం పోటీలో నిలబడితే నామినేషన్ వేయకుండా అడ్డుకున్నారని అన్నారు. మహిళ అని కూడా చూడకుండా తనపై దాడి చేసి... నామినేషన్ పత్రాలను చింపేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇంత జరుగుతున్నా పోలీసులు చోద్యం చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తూ... ఆందోళన చేపట్టారు. పోలీసులు తమను కలెక్టరేట్‌లోనికి అనుమతించకపోవడంతో వందలాది మంది కలెక్టరేట్ ముందు బైఠాయించారు.
రెండు స్థానాలకు ముగ్గురు పోటీ..
ఉమ్మడి రంగారెడ్డి జిల్లా స్థానిక సంస్థలో కోటాలో రెండు ఎమ్మెల్సీ స్థానాలకు ముగ్గురు బరిలో నిలబడ్డారు. అధికార పార్టీ మళ్లీ సిట్టింగ్‌లకే అవకాశం ఇవ్వడంతో పార్టీ అభ్యర్థులుగా పట్నం మహేందర్ రెడ్డి, శంభీపూర్ రాజులు ఎమ్మెల్సీ స్థానాలకు(TRS Candidates for local body mlc elections) నామినేషన్ దాఖలు చేశారు. రంగారెడ్డి కలెక్టర్ అమోయ్ కుమార్‌కు నామ పత్రాలు అందజేశారు. మహేందర్ రెడ్డి మూడు సెట్లు, శంభీపూర్ రాజు రెండు సెట్లు నామినేషన్లు దాఖలు చేశారు. అలాగే స్వతంత్ర అభ్యర్థిగా చలిక చంద్రశేఖర్ ఒక సెట్ నామినేషన్ దాఖలు చేశారు. బుధవారం నామినేషన్ పత్రాలను అధికారులు పరిశీలించనున్నారు. స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్న చంద్రశేఖర్ ఉపసంహరించుకుంటే ఈ రెండు ఎమ్మెల్సీ స్థానాలు మరోసారి అధికార పార్టీ అభ్యర్థులకే దక్కే అవకాశం ఉంది.
ముగిసిన గడువు
స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల(telangana mlc elections 2021) నామినేషన్ల గడువు మధ్యాహ్నం 3 గంటలతో ముగిసింది. మొత్తం 9 ఉమ్మడి జిల్లాల్లో 12 ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. బుధవారం నామినేషన్లను పరీశీలిస్తారు. 26 వరకు ఉపసంహరణకు అవకాశం ఉంటుంది. డిసెంబర్ 10 ఎన్నికలు జరగనున్నాయి. 14న ఫలితాలు వెల్లడిస్తారు.
ఇదీ చదవండి: Local body MLC Voter list: స్థానికసంస్థల కోటా మండలి ఎన్నికల ఓటర్ల ముసాయిదా జాబితా ప్రకటన