Telangana High Court Stay on Ramky Registrations: హైదరాబాద్ మహానగరం అభివృద్ధికి హెచ్‌ఎండీఏ సంస్థ ఎంతగానో తోడ్పడుతుంది. నగరంలో జరిగే పెద్ద పెద్ద నిర్మాణాలు చాలా మేరకు ఈ సంస్థనే నిర్మిస్తోంది. నగర అభివృద్ధికి వివిధ సంస్థలతో ఇది కలసి పని చేస్తోంది. నగరంలో ఉన్నతమైన వ్యాపారాల్లో టౌన్షిప్ నిర్మించడం ఒకటి. వీటి నిర్మించి విక్రయించేటప్పుడు కొన్ని నియమాలు పాటించాల్సి వస్తుంది. ఫ్లాట్లు కట్టే సంస్థ వివిధ సంస్థలతో, వ్యక్తులతో ఒప్పందం కుదుర్చుకుంటే వారికి తెలియజేసి.. ఫ్లాట్లను రిజిస్ట్రేషన్ చేయాలనే నిబంధనలు ఉన్నాయి. ఇదే విధంగా రెండు సంస్థలు ఇంటిగ్రేటేడ్ టౌన్‌షిప్‌లో ఒప్పందం కుదుర్చుకున్నాయి.
రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం శ్రీనగర్‌లోని రాంకీ ఇంటిగ్రేటెడ్ టౌన్‌షిప్‌లో రిజిస్ట్రేషన్లను హైకోర్టు నిలిపి వేసింది. విల్లాలు, ఫ్లాట్ల విక్రయాలకు అనుమతిస్తూ సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును అమలు చేస్తూ సీజే ధర్మాసనం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. రాంకీ నిర్మిస్తున్న డిస్కవరీ సిటీ, గార్డెనియా గ్రోవ్ విల్లాస్, గ్రీన్ వ్యూ అపార్టుమెంట్స్, ది హడుల్, గోల్డెన్ సర్కిల్ ప్రాజెక్టుల విల్లాలు, ఫ్లాట్ల విక్రయాలకు సింగిల్ జడ్జి అనుమతివ్వడాన్ని సవాల్ చేస్తూ హెచ్‌ఎండీఏ వేసిన పిటిషన్‌పై విచారణ జరిగింది.
రాంకీకి హెచ్‌ఎండీఏ 750 ఎకరాలు కేటాయించింది. మొదటి దశలో 374 ఎకరాల డెవలప్‌మెంట్ కోసం హెచ్‌ఎండీఏతో రాంకీ ఒప్పందం చేసుకుంది. ఒప్పందంలో భాగంగా వంద కోట్లలో రూ.25 కోట్లను చెల్లించిన రాంకీ.. మిగతా రూ.75 కోట్లను చెల్లించకుండానే రిజిస్ట్రేషన్లు పూర్తి చేస్తోందని హెచ్‌ఎండీఏ వాదించింది. తమ బకాయిలు చెల్లించే వరకు రిజిస్ట్రేషన్లు చేయవద్దని హెచ్‌ఎండీఏ లేఖ రాసింది. ఈ లేఖ ఆధారంగా రిజిస్ట్రేషన్లను నిలిపి వేయడాన్ని సవాల్ చేస్తూ ఆర్‌టీఐఎల్, రాంకీ ఇన్‌ఫ్రా, రాంకీ ఎస్టేట్స్ అండ్ ఫామ్ లిమిటెడ్ వేసిన పిటిషన్‌పై సింగిల్ జడ్జి గతంలో తీర్పునిచ్చారు.
లేఖ ఆధారంగా రిజిస్ట్రేషన్లు ఆపడం తగదన్న సింగిల్ జడ్జి ఉత్తర్వులను కొట్టివేయాలని కోరుతూ ధర్మాసనాన్నిహెచ్‌ఎండీఏ ఆశ్రయించింది. బకాయిలు చెల్లించకుండానే రిజిస్ట్రేషన్లకు ప్రయత్నిస్తోందని సంస్థ పేర్కొంది. దీనివల్ల హెచ్‌ఎండీఏకు నష్టం వాటిల్లుతుందని న్యాయవాది వాదించారు. కౌంటర్ దాఖలు చేయాలని రాంకీని హైకోర్టు ఆదేశించింది. సింగిల్ జడ్జి తీర్పుపై స్టే విధిస్తూ విచారణ ఈనెల 23కి వాయిదా వేసింది.
ఇవీ చదవండి: