రంగారెడ్డి జిల్లాలోని హిమాయత్‌సాగర్ జలాశయం నిండుకుండలా మారింది. ఇటీవల కురిసిన భారీ వర్షాలతో వరద పోటెత్తింది. జలాశయంలోకి వరదనీరు 1762.80 అడుగులకు వచ్చి చేరింది. రాబోయే కొద్ది రోజుల్లో రాష్ట్రంలో మరింత వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. 1763.00 అడుగుల స్థాయికి చేరుకున్న తర్వాత ఈ రోజు సాయంత్రం 4 గంటల తర్వాక ఎప్పుడైనా గేట్లు ఎత్తివేసే అవకాశం ఉందని జలమండలి ఎండీ వెల్లడించారు. సంబంధిత రెవెన్యూ అధికారులను జలమండలి అధికారులు అప్రమత్తం చేశారు.
హిమాయత్ సాగర్ లోతట్టు ప్రాంతాల్లో ఉన్న కాలనీలు, మురికివాడ ప్రాంతాలు, మూసీ నది పరివాహక ప్రాంత ప్రజలను వెంటనే సురక్షిత ప్రాంతాలకు తరలించాలని సూచించారు. అందుకు అవసరమైన సహాయక చర్యలు చేపట్టేందుకు సన్నద్ధం కావాలని హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల పరిపాలనా యంత్రాంగంతో పాటు.. జీహెచ్ఎంసీ, పోలీసు అధికారులను జలమండలి ఎండీ ఆదేశించారు. హిమాయత్ సాగర్‌లోకి నీరు అధికంగా రావడంతో సోమవారం మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు.
హిమాయత్‌సాగర్
- గరిష్ఠ నీటిమట్టం-1763.50 అడుగులు
- ప్రస్తుత నీటిమట్టం-1762.80 అడుగులు
ఉస్మాన్‌సాగర్ జలాశయం
- గరిష్ఠ నీటిమట్టం-1790 అడుగులు
- ప్రస్తుత నీటిమట్టం-1784.60 అడుగులు
ఇదీ చదవండి: Warning : మూసీ పరీవాహక ప్రాంతాల్లో మొదటి హెచ్చరిక జారీ