ప్రభుత్వానికి కాసుల వర్షం కురిపించిన కోకాపేట, ఖానామెట్ భూముల వేలంపై వస్తోన్న ఆరోపణలపై రాష్ట్ర ప్రభుత్వం వివరణ ఇచ్చింది. భూముల వేలం ప్రక్రియ అత్యంత పారదర్శకంగా జరిగినట్లు వెల్లడించింది. భూముల వేలంపై వస్తున్న ఆరోపణలు పూర్తిగా నిరాధారమని స్పష్టం చేసింది. ఈ మేరకు ఆరు పేజీలతో కూడిన ఓ ప్రకటనను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది.
‘‘భూముల వేలం పారదర్శకంగా జరిగింది. వేలంలో పాల్గొనకుండా ఎవరినీ మేం నియంత్రించలేదు. ఎవరైనా ఒక బిడ్‌ను ప్రభావితం చేస్తారనేది అపోహే. ఆన్‌లైన్‌లో 8 నిమిషాల పాటు వేలం పాటకు అవకాశం కల్పించాం. 8 నిమిషాలు ఎవరూ ఆసక్తి చూపకపోతేనే బిడ్ ఖరారు చేశాం. ప్లాట్ల ధరల్లో వేర్వేరు ధరలు ఉండటంలో ఆశ్చర్యం లేదు. భూముల వేలానికి స్విస్ ఛాలెంజ్ పద్ధతి సరికాదు. ఈ పద్ధతి పోటీని కొందరికే పరిమితం చేస్తుంది. ఆరోపణలపై పరువు నష్టం చర్యలు తీసుకుంటాం. వేలం గురించి నెల రోజులుగా ప్రచారం చేస్తున్నాం. పోటీని నివారించారని, రెవెన్యూ తగ్గించారనే ఆరోపణలు నిరాధారం. కొన్ని సంస్థలకే మేలు చేశారన్న ఆరోపణలు కూడా నిరాధారమైనవి. ’’ అని ప్రభుత్వం లేఖలో పేర్కొంది.
ప్రభుత్వ భూముల వేలం కోకాపేట్, ఖానామెట్ ప్రాంతాల్లో ఇదివరకే జరిగిందని.. ప్రస్తుతం జరిగిన వేలం కేవలం కొనసాగింపు ప్రక్రియ మాత్రమేనని వివరించింది. వేలం పాటను భారత ప్రభుత్వ రంగసంస్థ అయిన ఎంఎస్‌టీసీ సంస్థ ఆన్‌లైన్ బిడ్ పద్ధతి ద్వారా అత్యంత పారదర్శకంగా, ఎలాంటి అవకతవకలకు తావులేకుండ నిర్వహించినట్లు తెలిపింది. వేలం నిర్వహణకు సంబంధించి ఎలాంటి సంశయాలకు తావులేదని ప్రభుత్వం పేర్కొంది. సాధ్యమైనంత ఎక్కువ మంది పాల్గొనేలా చేయాలన్న సద్దుదేశంతోనే 25 కోట్ల కనీస ధర నిర్ణయించామన్న సర్కార్... వేలంలో ప్లాట్ల తుది ధర వేరుగా ఉండడంలో ఆశ్చర్యం లేదని తెలిపింది. మార్కెట్ నిర్ణీత విలువ లేనంత వరకు స్విస్ ఛాలెంజ్ పద్ధతిలో వేలం పాటకు వీలు పడదని.. ఎక్కువ మంది వేలంలో పాల్గొనేలా చర్యలు తీసుకున్నట్లు వివరించింది.
వేలంపై విస్తృత ప్రచారం
భూముల వేలంపై విస్తృత ప్రచారం కల్పించడంతో పాటు ప్రపంచంలోని వివిధ ముఖ్యమైన విదేశాలలోని భారత రాయబార సంస్థలకు ప్రత్యక్షంగా వివరాలు పంపామని తెలిపింది. విదేశాంగ శాఖ కూడా ప్రకటన, సమాచారాన్ని భారత రాయబార కార్యాలయాలకు పంపించినట్లు పేర్కొంది. ఆన్ లైన్ వేలం పారదర్శకంగా, ఫిర్యాదులకు ఆస్కారం లేని విధంగా జరిగిందని స్పష్టం చేసింది.
భూముల వేలం నిర్వహించిన హెచ్ఎండీఏ, టీఎస్ఐఐసీ సంస్థలకు కూడా వేలం సమయంలో అందులో పాల్గొంటున్న వ్యక్తులు, సంస్థల వివరాలు తెలియవని లేఖలో వివరించింది. ఎవరైనా ఒక బిడ్‌ను ప్రభావితం చేస్తారనే అపోహలకు ఏమాత్రం ఆస్కారం లేదని... పారదర్శకంగా నిర్వహించిన ప్రక్రియలో రాష్ట్ర ప్రభుత్వానికి మంచి మార్కెట్ ధర వచ్చిందని తెలిపింది.