నాయీ బ్రాహ్మణులు, రజకులకు ఉచిత విద్యుత్ పథకానికి సంబంధించి లబ్ధిదారులు తమ పేర్లు నమోదు చేసుకునేందుకు ప్రత్యేక డ్రైవ్ నిర్వహించాలని.. జిల్లా కలెక్టర్లు, బీసీ సంక్షేమ శాఖ అధికారులను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ ఆదేశించారు. 250 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ పథకం అమలుపై సంబంధిత శాఖల అధికారులతో సీఎస్.. హైదరాబాద్‌లోని బీఆర్కే భవన్‌లో సమీక్ష నిర్వహించారు. పథకం కింద ఇప్పటి వరకు 28,550 మంది దరఖాస్తు చేసుకున్నారని అధికారులు తెలిపారు. అందులో 10,637 మంది రజకులు, 17,913 మంది నాయీబ్రాహ్మణులు ఉన్నారని వివరించారు.
లబ్ధిదారులు తమ దరఖాస్తులను మీసేవా కేంద్రాల్లో ఉచితంగా నమోదు చేసుకునే సౌకర్యం కల్పించాలని ఐటీ అధికారులను సీఎస్ ఆదేశించారు. సీజీజీలో రిజిస్టర్ చేసుకున్న దరఖాస్తులను సంబంధిత అధికారులు వెంటనే సంబంధిత డిస్కంలకు పంపించి ఉచిత విద్యుత్ పథకాన్ని పొందేలా చర్యలు తీసుకోవాలని చెప్పారు.
ఆ సందేశాలు నమ్మొద్దు
రాష్ట్రంలో సైబర్ మోసాల పట్ల విద్యుత్ వినియోగదారులను అప్రమత్తం చేశారు దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ సీఎండీ రఘురామరెడ్డి. కరెంట్ బిల్లుల చెల్లింపు పేరుతో వచ్చే మోసపూరిత ఫోన్ కాల్స్‌ను నమ్మొద్దని సూచించారు. విద్యుత్ బిల్లుల చెల్లింపు పేరుతో కొంతమంది వ్యక్తులు వినియోగదారులను మెసేజ్, ఫోన్‌ల ద్వారా సంప్రదిస్తున్నారని సీఎండీ చెప్పారు. బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయంటూ రాత్రి పూట విద్యుత్ సరఫరా నిలిపివేస్తామని బెదిరించి వారి బ్యాంక్ ఖాతా, డెబిట్ కార్డు వివరాలు తీసుకొని నగదు విత్ డ్రా చేసుకుంటున్నట్లు తమ దృష్టికి వచ్చిందని వెల్లడించారు.
ఈ క్రమంలో వినియోగదారులు బిల్లు చెల్లించినా కూడా, ఒక వేళ ఎవరైనా వ్యక్తులు ఫోన్ లేదా మెసేజ్ ద్వారా గాని విద్యుత్ బిల్లు పెండింగ్‌లో ఉందని పేర్కొంటే.. వినియోగదారులు తాము చెల్లించిన వివరాలను సంస్థ వెబ్‌సైట్ www.tssouthernpower.com లేదా TSSPDCL మొబైల్ యాప్‌లో సరి చూసుకోవాలని రఘురామరెడ్డి సూచించారు. ఏమైనా సందేహాలు ఉంటే సంస్థకు ఆన్‌లైన్ ద్వారా గాని, సంబంధిత సెక్షన్ ఆఫీసర్ (AE)ని గాని సంప్రదించి సరిచేసుకోవాలని చెప్పారు. మోసపూరిత లింకులు, మెసేజ్‌లు వస్తే పోలీసులకు ఫిర్యాదు చేయాలని తెలిపారు.
ఇదీ చదవండి: KTR: 'సోలార్ విద్యుదుత్పత్తిలో.. దేశంలోనే తెలంగాణ రెండోస్థానం'