దశాబ్దాల స్వప్నం నెరవెరబోతుంది. పాడి రైతులకు ఆలంబన దిశగా వ్యవసాయ అనుబంధ పాడి పరిశ్రమ రంగం అభివృద్ధిపై సర్కారు ప్రత్యేక దృష్టి సారించింది. పాడి పరిశ్రమకు మరింత ఊతమిచ్చేందుకు 250 కోట్ల రూపాయల వ్యయంతో తెలంగాణ రాష్ట్ర పాడి పరిశ్రమాభివృద్ధి సహకార సమాఖ్య లిమిటెడ్ మెగా డెయిరీ నిర్మాణానికి పునాదిరాయి పడింది. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం రావిర్యాల వద్ద 32 ఎకరాల విస్తీర్ణంలో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన ప్రాజెక్టుకు మంత్రులు తలసాని శ్రీనివాస్‌యాదవ్, సబితా ఇంద్రారెడ్డి తమ చేతుల మీదుగా శంకుస్థాపన చేశారు. తెలంగాణ ఆవిర్భావం సమయంలో 8 రకాల పాల ఉత్పత్తులు ఉండగా... ఏడేళ్ల వ్యవధిలో 36 ఉత్పత్తుల వరకు పెరిగింది.
14 రకాల ఉత్పత్తులు మార్కెట్లోకి విడుదల
విజయ తెలంగాణ బ్రాండ్ పేరిట వాటర్ బాటిల్ ఆదరణ పొందుతున్న నేపథ్యంలో తాజాగా కాజు కట్లీ, సున్నుండలు, సోన్ పాప్డి ఇలాచీ, రాగి లడ్డూ, మలై లడ్డూ లాంటి 14 రకాల ఉత్పత్తులు మార్కెట్లోకి విడుదల చేశారు. ఈ ప్రాజెక్టు నిర్మాణం పూర్తయ్యే నాటికి పది లక్షల మంది రైతులచే పాలు డెయిరీకి పోసేలా ప్రణాళికలు రూపొందించి అమలు చేయాలన్నది లక్ష్యంగా పెట్టుకున్నారు. ప్రైవేటు రంగానికి ధీటుగా సహకార రంగంలో నడుస్తున్న అతిపెద్ద సంస్థ విజయ డెయిరీ అని... గ్రామీణ రైతులంతా పాలు పోసి బలోపేతం చేసుకుంటే ఆ లాభాల్లో నుంచి పాడి ఉత్పత్తిదారులకు వాటా ఇవ్వడానికి అవకాశం ఉంటుందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. ఇది పూర్తై ప్రారంభం సమయానికి ఇప్పుడు ఉన్న ఉత్పత్తులను 50 రకాల ఉత్పత్తులు వరకు తీసుకొచ్చి మార్కెట్‌ను మరింత విస్తృతం చేస్తామన్నారు. దేశవ్యాప్తంగా విస్తరణలో భాగంగా అంకుర కేంద్రాలను పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తూ వేలాది మంది గ్రామీణ యువతకు ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కల్పించనున్నామని మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ అన్నారు.
నష్టాల నుంచి లాభాల్లోకి..
సహకార రంగంలో బ్యాంకు గ్యారంటీతో ఈ ప్రాజెక్టు రెండేళ్ల వ్యవధిలో పూర్తి చేయాలని సర్కారు నిర్ణయించింది. మెగా డెయిరీ ప్రాంగణంలో 5 లక్షల నుంచి 8 లక్షల లీటర్ల వరకు పాల శుద్ధి ప్లాంటు, 5 వేల లీటర్ల ఉత్పత్తి సామర్ధ్యం గల ఐస్ క్రీం ప్లాంటు, రోజుకు లక్ష లీటర్ల టెట్రా పాల ప్యాకెట్ ఉత్పత్తి ప్లాంట్‌తోపాటు నెయ్యి, వెన్న, ఫ్లేవర్డ్ మిల్క్ తయారీ కేంద్రాలు ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి తలసాని తెలిపారు. రంగారెడ్డి జిల్లాలో రైతులు, యువతకు రాయితీపై పాడిపరిశ్రమ స్థాపనకు రుణాలిచ్చి ప్రోత్సహించాలని మంత్రి సబితా ఇంద్రారెడ్డి కోరారు.
పాల మార్కెట్‌ను హస్తగతం చేసుకునేలా..
మంత్రి సబితా విజ్ఞప్తిపై స్పందించిన మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్... రంగారెడ్డి జిల్లాను పైలట్ ప్రాజెక్టుగా తీసుకుని రైతులు, యువతకు పెద్ద ఎత్తున రుణాలు ఇచ్చి పాడి పరిశ్రమ రంగంలోకి ప్రవేశించేందుకు ప్రోత్సాహానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. కోటి పైగా జనాభా గల హైదరాబాద్ వాసుల పాల డిమాండ్ రోజుకు 30 లక్షల లీటర్లని తెలిపారు. ప్లాంట్ పూర్తయ్యాక హైదరాబాద్ మార్కెట్ విజయ డైయిరీ హస్తగతం చేసుకుంటుందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆశాభావం వ్యక్తం చేశారు.
ఇదీ చదవండి: modi - kcr meet: ప్రధాని మోదీకి పది లేఖలు అందజేసిన సీఎం కేసీఆర్