Konda vishweshwar reddy: మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి భాజపాలో చేరే అవకాశాలు మెండుగానే కనిపిస్తున్నాయి. భాజపా రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జీ తరుణ్‌చుగ్, రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కొండా విశ్వేశ్వర్‌రెడ్డితో భేటీ అయి పార్టీలోకి ఆహ్వానించారు. దాదాపు గంటపాటు సమావేశం కాగా.. జులై 1న భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సమక్షంలో భాజపాలో చేరేందుకు ఆయన సుముఖత వ్యక్తం చేసినట్లు సమాచారం. పార్టీలో చేరడంపై విశ్వేశ్వర్‌రెడ్డికి ఉన్న సందేహాలను భాజపా నేతలు నివృత్తి చేసి, జేపీ నడ్డాతో ఫోన్లో మాట్లాడించినట్లు తెలుస్తోంది.
కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన కొండా విశ్వేశ్వర్‌రెడ్డి.. గత ఏడాది కాలంగా భాజపాలో చేరతారనే ప్రచారం జోరుగా సాగుతోంది. గతంలో మాజీ మంత్రి ఈటల రాజేందర్ తెరాసకు రాజీనామా చేసిన సమయంలో కొండా ఈటలతో భేటీ అయ్యారు. మేడ్చల్ జిల్లా శామీర్‌పేటలోని ఈటల నివాసంలో దాదాపు గంటపాటు వివిధ అంశాలపై చర్చించారు. అప్పటి రాజకీయ పరిస్థితుల దృష్ట్యా వీరి భేటీ అత్యంత ప్రాధాన్యం సంతరించుకుంది. వీరిద్దరూ కలిసి కొత్త పార్టీ పెడతారా..? లేదా ఒకే పార్టీలో చేరబోతున్నారా..? అనే చర్చలు కూడా సాగాయి. చివరికి తాను ఏ పార్టీలో చేరడం లేదని.. ఈటల భార్య బంధువు కావడంతో కేవలం ఆయనకు ధైర్యం చెప్పేందుకే వచ్చానని కొండా ప్రకటించడంతో ఆ చర్చలకు అక్కడితో పుల్‌స్టాప్ పడింది. అప్పటి నుంచి ఏ పార్టీలో చేరకుండా కొండా తటస్థంగా ఉన్నారు.
ఇదీ చూడండి: 'రాజకీయ నేతగా రాలేదు... ఈటలకు ధైర్యం చెప్పేందుకు వచ్చా'
కొత్తపార్టీపై కోమటిరెడ్డితో సమాలోచనలు..! కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన నాటి నుంచి ఏ పార్టీలో చేరకుండా తటస్థంగా ఉన్న కొండా విశ్వేశ్వర్ రెడ్డి.. గత నెలలో కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని కలిశారు. తాజా రాజకీయ పరిణామాలు, కొత్త పార్టీ స్థాపనపై సమాలోచనలు చేశారు. దీంతో వీరి భేటీకి ప్రాధాన్యం సంతరించుకుంది. ఇద్దరూ కలిసి కొత్త పార్టీ పెడతారనే ఊహాగానాలూ వచ్చాయి. మరోవైపు.. కొండా మళ్లీ సొంత గూటికే చేరబోతున్నాన్న వార్తలు కూడా గుప్పుమన్నాయి.
అయితే.. తాను కాంగ్రెస్‌లో చేరేది లేదంటూ కొండా కుండ బద్దలుకొట్టారు. తాను కాంగ్రెస్‌లో చేరుతున్నట్లు వార్తలు రావడం బాధాకరమని ఆందోళన వ్యక్తం చేశారు. తాను, కాంగ్రెస్ ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి ఇద్దరం ఒకే ఆలోచనతో ఉన్నామని.. తాము కేసీఆర్ కుటుంబ పాలనకు వ్యతిరేకమని అన్నారు. రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్‌లో ఉన్నా ఇదే ఆలోచనతో ఉన్నారని ఆయన వివరించారు. దీంతో ఇద్దరూ కలిసి కొత్త పార్టీ పెడతారనే చర్చా కొద్దికాలం నడిచింది. రాజగోపాల్‌రెడ్డి సైతం కాంగ్రెస్ పార్టీతో అంటీముట్టనట్లుగా ఉంటున్న విషయం తెలిసిందే. గతంలో వరంగల్ రాహుల్ గాంధీ సభకు, పీసీసీ విస్తృత స్థాయి సమావేశానికి ఆయన దూరంగా ఉన్న విషయం తెలిసిందే.
ఇదీ చూడండి: కొండా కొత్త పార్టీ?.. కోమటిరెడ్డితో సమాలోచనలు!
చెప్పకనే చెప్పారుగా.. తాను ఏ రాజకీయ పార్టీలో లేనని, తటస్థంగా ఉంటున్నట్లు గతంలో తెలిపిన కొండా విశ్వేశ్వర్‌రెడ్డి.. తమ పార్టీలో చేరాలంటూ కాంగ్రెస్‌తో పాటు భాజపా నుంచీ తనకు ఆహ్వానం ఉందని స్పష్టం చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌లో క్యాడర్, ఓట్లు బలంగా ఉన్నప్పటికీ జాతీయ నాయకత్వం బలహీనంగా ఉందని.. భాజపాకు క్యాడర్ లేకున్నా ప్రజల్లో నమ్మకం ఉందని వ్యాఖ్యానించారు. తద్వారా భాజపాలో చేరేందుకు ఆసక్తి చూపిస్తున్నట్టు సూత్రప్రాయంగా చెప్పినట్లయింది. ఇప్పుడు కమలనాథులతో భేటీతో.. కాషాయ కండువా కప్పుకోవటమే తరువాయి అన్న వార్తలు బలంగా వినబడుతున్నాయి. కమలనాథులతో జట్టు కట్టే విషయాన్ని అధికారంగా ప్రకటించే వరకు అభిమానులు వేచి చూడాల్సిందే..!!
ఇవీ చూడండి..