రంగారెడ్డి జిల్లా యాచారం మండలం కుర్మిద్దిలో కాంగ్రెస్ బృందం పర్యటించింది. ఫార్మాసిటీలో భూమిని కోల్పోతున్న రైతులతో సమావేశమైంది. ఫార్మాసిటీ ఆపడం కోసం పోరాటం మొదలైందని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అన్నారు. అక్టోబర్ 11 న ఫార్మాసిటీకి వ్యతిరేకంగా నిరసనలు చేపడతామన్నారు. 2023లో అధికారంలోకి రాగానే ఫార్మాసిటీ రద్దు చేస్తామన్నారు.
ఫార్మాసిటీతో భూగర్భ జలాలు, కృష్ణ నీళ్లు కలుషితం అవుతాయన్నారు. ఇందిరమ్మ పంపిణీ చేసిన ఎనిమిది వేల ఎకరాలు, రైతుల వద్ద నుంచి 12 వేల ఎకరాలు మొత్తం 20 వేల ఎకరాలు వ్యవసాయ భూములను ఫార్మాసిటీకి ధారాదత్తం చేస్తే...చూస్తూ ఊరుకునేది లేదని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. నాడు ఇందిరమ్మ పేదలు కోసం భూములు పంపిణీ చేస్తే.. ఇవాళ ముఖ్యమంత్రి కేసీఆర్ దళారి అవతారమెత్తి ఆ భూములను కార్పొరేట్లకు పంచుతున్నారని భట్టి విక్రమార్క ఆరోపించారు.
భూములు లాక్కునే ప్రయత్నం చేస్తే ప్రాణాలైనా ఇస్తామని.. వాటిని మాత్రం వదులుకునేది లేదని స్పష్టం చేశారు. నిరుద్యోగులు, పేదలు, భూమిలేని నిరుపేదల కోసమే ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని కాంగ్రెస్ పార్టీ ఇచ్చిందన్నారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత కేసీఆర్ ఎస్సీలకు, పేదలకు మూడెకరాల భూమిని ఇస్తామని చెప్పి.. ఇప్పుడు కంపెనీల పేరుతో భూములను లాక్కుంటున్నారని అన్నారు. ఈ సమస్య పరిష్కరం అయ్యే వరకు ఉద్యమిస్తామని చెప్పారు. పంట భూములు తీసుకొని రైతులకు అన్యాయం చెయ్యొద్దని ఎమ్మెల్యే సీతక్క అన్నారు. విషం వెదజల్లే ఫార్మాసిటీ ఎందుకంటూ ప్రశ్నించారు. ఫార్మాసిటీ రద్దు చేసే వరకు రైతుల పక్షాన నిలబడి పోరాడతామని చెప్పారు.
ఇదీ చదవండి: ఆన్లైన్ పాఠాలకు... స్మార్ట్‌సిటీకి విద్యుత్ కోతలు