జన్‌సంఘ్ వ్యవస్థాపకుడు డాక్టర్ శ్యామ్‌ప్రసాద్ ముఖర్జీ వర్ధంతి పురస్కరించుకుని నిర్వహించిన బలిదాన్ దివస్‌లో భాజపా జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ పాల్గొన్నారు. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలంలోని పెద్ద తుప్పారలో.. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి... ముఖర్జీ చేసిన సేవలను కొనియాడారు. మొక్కలు నాటి మహనీయునికి నివాళుర్పించారు. ప్రతి ఒక్కరూ జీవితంలో కనీసం ఐదు మొక్కలు నాటి...వాటిని సంరక్షించాలని కోరారు.
రోడ్డుపై విచ్చలవిడిగా పడి ఉన్న ప్లాస్టిక్ పేపర్‌లను, వాటర్ బాటిళ్లను డీకే అరుణ తొలగించారు. ప్రతి ఒక్కరు తమ వీధులను పరిశుభ్రంగా ఉంచుకోవడానికి వారానికి ఒక్కసారైనా శ్రమదానం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో రంగారెడ్డి జిల్లా భాజపా అధ్యక్షుడు బొక్క నర్సింలు, రాష్ట్ర నాయకులు బుక్కవేణు గోపాల్, నందకిషోర్, చిటికెల వెంకటయ్య తదిపారులు పాల్గొన్నారు.
తుది శ్వాస వరకూ ముఖర్జీ పోరాటం..
శ్యామాప్రసాద్ ముఖర్జీ బెంగాలీ న్యాయవాది. విద్యావేత్త. సర్ అశుతోష్ ముఖర్జీ తనయుడు. నెహ్రూ మంత్రివర్గంలో ఒకసారి మంత్రిగా కూడా పనిచేశారు. జమ్ముకశ్మీర్ సహా పలు అంశాలపై నెహ్రూతో విభేదించి మంత్రి పదవిని వదులుకున్నారు.
1951 అక్టోబర్ 21న జనసంఘ్‌ను స్థాపించారు. జమ్ముకశ్మీర్‌కు ప్రత్యేక రాయితీలేమీ లేకుండా భారత్‌లో కలిపెయ్యాలని ఒత్తిడి చేశారు. కనీసం జమ్ము, లద్దాఖ్‌లనైనా భారత్‌లో సంపూర్ణంగా విలీనం చేయాలని డిమాండ్ చేశారు. జనసంఘ్ కార్యకర్తలు, హిందూమహాసభ, రామరాజ్య పరిషత్‌లతో కలిసి ఉద్యమించారు.
1953 మే 11న అనుమతి లేకుండా జమ్ముకశ్మీర్‌లోకి ప్రవేశించగా.. షేక్ అబ్దుల్లా నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం అరెస్టు చేసి శ్రీనగర్ జైలులో ఉంచింది. జూన్ ప్రారంభంలో ఆయన అనారోగ్యం బారిన పడ్డారు. జూన్ 22న గుండెపోటు వచ్చింది. జూన్ 23న మరణించారు.
ఇది చదవండి: 'ప్రజాస్వామ్యంపై ఉక్కుపాదం.. అత్యవసర పరిస్థితి'