దేశంలో రెండో అతిపెద్ద మార్కెట్‌గా ప్రసిద్ధిగాంచిన గడ్డి అన్నారం పండ్ల మార్కెట్ తరలింపు కోసం సన్నాహాలు సాగుతున్నాయి. ఈ వ్యవసాయ మార్కెట్ యార్డును తాత్కాలికంగా రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్ మండలం బాటసింగారం లాజిస్టిక్ పార్కుకు తరలించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రభుత్వ ఉద్దేశాలు, మార్కెట్ తరలింపు అంశాలను కమీషన్ ఏజెంట్లకు మార్కెటింగ్ శాఖ తెలియజేసింది.
త్వరలో మార్కెట్‌ను ఖాళీ చేసి తాత్కాలికంగా జాతీయ రహదారిపై ఉన్న హెచ్ఎండీఏ (HMDA) లాజిస్టిక్ పార్కుకు వెళ్లాల్సిందేనని స్పష్టం చేసింది. ఈ లాజిస్టిక్ పార్కులో షెడ్లు, తాగు నీరు, విద్యుత్, మరుగుదొడ్లు, పండ్ల లోడింగ్, అన్ లోడింగ్ వంటి మౌలిక సదుపాయాలు పరిశీలించేందుకు మంగళవారం ఏర్పాటు చేసిన క్షేత్రస్థాయి పరిశీలన కార్యక్రమం విఫమైంది. బాటసింగారం చూపిస్తామని ఆహ్వానించిన మార్కెటింగ్ శాఖ అధికారులు రాకుండా తీవ్ర నిరాశకు గురి చేశారని... ఈ లాజిస్టిక్ పార్కు వద్ద మౌలిక సౌకర్యాలు లేనందున వెళ్లలేమని కమీషన్ ఏజంట్లు చెబుతున్నారు.
మౌలిక సదుపాయాలు కల్పిస్తేనే వెళ్తాం...
కరోనా దృష్ట్యా ప్రత్యామ్నాయంగా నగర శివారులోని బాటసింగారం తరలించి మార్కెట్ కార్యకలాపాలు సజావుగా నడిపించేందుకు మార్కెటింగ్ శాఖ చేస్తున్న ఏర్పాట్లేమీ కనిపించడం లేదు. రెండేళ్లపాటు బాటసింగారంలో మార్కెట్ కార్యకలాపాలు నడిపించిన తర్వాత... ఈలోగా కొహెడలో అత్యాధునిక సదుపాయాలతో కూడిన మార్కెట్ నిర్మించాలనేది ప్రభుత్వ లక్ష్యం. గడ్డిఅన్నారం పండ్ల మార్కెట్‌లో 421 మంది కమీషన్ వ్యాపారులు లైసెన్సులు కలిగి ఉన్నారు. ప్రత్యక్షంగా, పరోక్షంగా 10 వేల మందికి పైగా నిత్యం మార్కెట్ యార్డుకు వచ్చి కొనుగోలు చేసి తీసుకెళ్లి బహిరంగ మార్కెట్‌లో పండ్లు అమ్ముకుంటున్నారు. 178 ఎకరాల విస్తీర్ణం గల కొహెడలో పూర్తి స్థాయిలో అత్యాధునిక మౌలిక సదుపాయాలు కల్పిస్తే తాము వెళ్లేందుకు సిద్ధమేనని కమీషన్ ఏజెంట్లు తెలిపారు.
అవసరమైతే పోలీసు బందోబస్తు నడుమ..
ఇప్పటికే కమీషన్ ఏజెంట్లకు నోటీసులు జారీ చేసిన దృష్ట్యా... నిర్దేశిత గడువులోగా వ్యాపారులు సుముఖత వ్యక్తం చేయకపోతే పోలీసు బందోబస్తు మధ్య బలవంతంగానైనా సరే ఖాళీ చేయించేందుకు సన్నాహాలు చేస్తోంది.
ఇదీచూడండి: Hyderabad police: నా పతకం పోలీస్ సేవలకు అంకితం: పీవీ సింధు