అక్రమ మైనింగ్ ఆపాలని డిమాండ్ చేస్తూ రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్ మండలం సద్దుపల్లి వద్ద పలు గ్రామాల ప్రజలు ఆందోళనకు దిగారు. స్థానిక రాజకీయ పార్టీల సహకారంతో టిప్పర్ వాహనాలను అడ్డుకున్నారు. క్రషర్స్ ద్వారా మైనింగ్‌కు పాల్పడుతున్న వారిపై చర్యలు తీసుకునేంత వరకు కదిలేది లేదని ధర్నాకు దిగారు. నిరసనకారులకు కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి మద్దతు తెలిపారు. ఆర్టీఏ అధికారులు, మైనింగ్ అధికారులతో ఫోన్‌లో సంప్రదించి వారిని పిలిపించారు. అనంతరం అక్కడికి వచ్చిన అధికారులు.. అనుమతులు లేని వాహనాలు, క్రషర్స్ నుంచి ఓవర్ లోడ్‌తో వస్తున్న వాహనాలను సీజ్ చేశారు. సీజ్ చేసిన వాహనాలను తమ ఆధీనంలో ఉంచుతామని తెలిపారు.
మండలంలోని 8 గ్రామాల ప్రజలు మైనింగ్ మాఫియాతో నరక యాతన అనుభవిస్తున్నారని రంగారెడ్డి మండిపడ్డారు. అందుకే అన్ని గ్రామల ప్రజలు ఈ రోజు ఎదురు తిరిగారని పేర్కొన్నారు. ప్రాణాలు తీస్తున్న మైనింగ్ మాఫియాతో అధికార పార్టీ నాయకులు, ప్రభుత్వ అధికారుల హస్తం ఉందని ఆరోపించారు. ప్రజల ప్రాణాలు కాపాడటంలో అధికారులు నిర్లక్ష్యం వహిస్తే ఎంతదూరం వెళ్లడానికైనా కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉంటుందని హామీ ఇచ్చారు.
ఇదీ చదవండి: ఆరున్నరేళ్లలో రాష్ట్రంలో ఎంతో అభివృద్ధి : లక్ష్మీకాంతారావు