విదేశాల నుంచి వచ్చిన సుమారు 64 వేల మంది ప్రయాణికులకు వైద్యులు కరోనా స్క్రీనింగ్‌ను నిర్వహించారని సైబరాబాద్ సీపీ సజ్జనార్ తెలిపారు. శంషాబాద్ విమానాశ్రయంలో కరోనా థర్మల్ స్క్రీనింగ్‌ను జీఎంఆర్ అధికారులతో కలిసి సీపీ పరిశీలించారు. విమానాశ్రయంలో మూడు బృందాలుగా 200 మంది డాక్టర్లు విధులు నిర్వహిస్తున్నారని తెలిపారు. సీఐఎస్ఎఫ్తో పాటు అదనంగా 200 మంది పోలీసులు విధులు నిర్వహిస్తున్నారని పేర్కొన్నారు.
మూడు విభాగాలుగా
విదేశాల నుంచి వచ్చే ప్రయాణికులను మూడు విభాగాలుగా విభజించి పరీక్షలు చేస్తున్నారని సజ్జనార్ వివరించారు. జలుబు, దగ్గు, జ్వరం ఉంటే వారిని గాంధీ, ఇతర ఆస్పత్రులకు తరలిస్తున్నారని పేర్కొన్నారు. కరోనా ప్రభావం ఎక్కువగా ఉన్న ఏడు దేశాలు చైనా, ఉత్తర కొరియా, దక్షిణ కొరియా, ఇటలీ, స్పెయిన్, ఇరాన్, జర్మనీ నుంచి వచ్చే వారి వివరాలు నమోదు చేస్తున్నామన్నారు. కరోనా లక్షణాలు ఉంటే ప్రత్యేక కిట్ ఇచ్చి గాంధీకి తరలిస్తున్నట్లు తెలిపారు.
చర్యలు తప్పవు
వైరస్ లక్షణాలు లేకపోయినా విదేశాల నుంచి వచ్చిన వారిని వారి ఇంటి వద్ద 14 రోజులు ఆశ వర్కర్లు తనిఖీ చేస్తున్నారన్నారు. కరోనాపై సామాజిక మాధ్యమాల్లో అసత్య ప్రచారం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.
ఇదీ చూడండి: భారత్‌లో 107కు చేరుకున్న కరోనా కేసులు