రంగారెడ్డి జిల్లా షాద్నగర్ పట్టణంలో రోటరీ క్లబ్ ఆఫ్ భాగ్యనగర్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఐసోలేషన్ కేంద్రాన్ని ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ ప్రారంభించారు. కొవిడ్ -19 వ్యాధి బారిన పడిన వారికి రోటరీ క్లబ్ చేస్తున్న సేవలను అభినందించారు. దీనులు, నిరాశ్రయులు, వృద్ధులు, వ్యాధిగ్రస్థులకు రాష్ట్రంలోని స్వచ్ఛంద సంస్థలు చేస్తున్న కృషి మరువలేనివని కొనియాడారు.
గ్రామీణులకు సేవలందించడానికి అవకాశం కలగడం ఆనందం ఇస్తుందని రోటరీ క్లబ్ డిస్ట్రిక్ట్ గవర్నర్ ఎంవి హనుమంత్ రెడ్డి అన్నారు. షాద్నగర్ ఐసోలేషన్ కేంద్రంలో 30 పడకలు ఏర్పాటు చేశామని.. వ్యాధి తీవ్రంగా ఉన్నవారు, ఇంట్లో ప్రత్యామ్నాయ పరిస్థితులు లేనివారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో పురపాలిక ఛైర్మన్ కొందూటి నరేందర్, వైస్ ఛైర్మన్ నటరాజ్, కౌన్సిలర్ వెంకట్రాంరెడ్డి తదితరులు పాల్గొన్నారు.