రాష్ట్రంలో ప్రస్తుతం 152 పారిశ్రామిక పార్కులు ఉండగా.. ప్రభుత్వం గత ఏడాది కొత్తగా పదింటిని చేపట్టింది. వాటికి 3,900 ఎకరాల భూమిని కేటాయించింది. 7,623 మందికి ఉపాధి లక్ష్యం. వాటిలో దండుమల్కాపూర్(యాదాద్రి), బండమైలారం(సిద్దిపేట), మందపల్లి(సిద్దిపేట), శివనగర్(సిరిసిల్ల) ప్రారంభమయ్యాయి. రాయరావుపేట(మేడ్చల్), సిరిసిల్ల ఆక్వా ఇండస్ట్రియల్ పార్క్, తునికిబొల్లారం(సిద్దిపేట), జిన్నారం(సంగారెడ్డి), దివిటిపల్లి(మహబూబ్‌నగర్), ఒస్మాన్‌నగర్(సంగారెడ్డి) పార్కులు ఇంకా ప్రారంభం కాలేదు. ఆయా ప్రాంతాల్లో రోడ్లు, ఇతర మౌలిక సదుపాయాలను సైతం ప్రభుత్వం కల్పించింది. గత ఏడాది మార్చి నుంచి మొదలైన కరోనాతో పరిస్థితులు తలకిందులయ్యాయి.
ఔత్సాహికులకు బ్యాంకులే ఆధారం..
చిన్న పరిశ్రమల స్థాపనకు పారిశ్రామికవేత్తలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రధానంగా ఔత్సాహికులు 95 శాతానికి పైగా బ్యాంకుల మీదే ఆధారపడుతున్నారు. రుణాల కోసమని వెళ్తే వారికి నిరాశే ఎదురవుతోంది. కరోనా పరిస్థితుల్లో పారిశ్రామిక రంగం ఒడిదొడుకులకు లోను కావడంతో బ్యాంకులు సాయానికి వెనుకంజ వేస్తున్నాయి. పూచీకత్తు లేనిదే రుణం ఇవ్వలేమని చెబుతున్నాయి. చాలా మంది నిధుల సమీకరణకు రాష్ట్ర ఆర్థిక సంస్థను(ఎస్‌ఎఫ్‌సీని) ఆశ్రయిస్తున్నారు. కొత్తవాటి కంటే ఇప్పటికే ఉన్న పరిశ్రమల విస్తరణకు ఎస్‌ఎఫ్‌సీ ప్రాధాన్యం ఇస్తోంది. 2020కి ముందు రాష్ట్ర ప్రభుత్వ వినతి మేరకు బ్యాంకులు పారిశ్రామిక రుణ మేళాలను నిర్వహించాయి. గత ఏడాది మార్చి నుంచి అవి నిలిచిపోయాయి. టీఎస్‌ఐఐసీ నిబంధనల మేరకు భూ కేటాయింపుల తర్వాత కొత్త పరిశ్రమల స్థాపనకు రెండేళ్ల గడువు ఉంటుంది. ఇప్పటికే 16 నెలలు గడిచింది. మరో 8 నెలలే మిగిలి ఉంది. అప్పటి వరకు కరోనా మూడో దశ వస్తే తమ పరిస్థితిలో మార్పు రాదనే ఆందోళన ఔత్సాహిక పారిశ్రామికవేత్తల్లో ఉంది.
విస్తరణకు విఘాతం..
కొన్ని పరిశ్రమలు విస్తరణకు కొత్త పారిశ్రామిక పార్కులు అనువైనవని గుర్తించి దరఖాస్తు చేసుకున్నాయి. వాటికి రాష్ట్ర పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ (టీఎస్‌ఐఐసీ) అనుమతులు ఇచ్చింది. పెట్టుబడుల వరకు వచ్చే సరికి నిధుల సమస్య ఏర్పడడంతో అక్కడ పరిశ్రమలు స్థాపించడానికి పారిశ్రామికవేత్తలు ముందుకురావడం లేదు.
ప్రత్యామ్నాయాలపై పరిశ్రమల శాఖ దృష్టి..
కొత్త పారిశ్రామికపార్కుల్లో తయారీ పరిశ్రమలు రాని పక్షంలో వాటిని ఆహారశుద్ధి తదితర పరిశ్రమలకు కేటాయించాలని పరిశ్రమల శాఖ భావిస్తోంది. దీనికి అనుగుణంగా ప్రతిపాదనలు రూపొందించి రాష్ట్ర ప్రభుత్వానికి పంపింది.
ఆశలు నెరవేరడం లేదు..
రాయరావుపేటలో కొత్త పరిశ్రమను స్థాపించాలని భావించా. పెట్టుబడుల కోసం ఎంత ప్రయత్నించినా సాయం అందడం లేదు. కరోనా వల్ల రెండేళ్లు వెనక్కివెళ్లినట్లు అనిపిస్తోంది. - శ్రీనివాస్, ఈసీఐఎల్
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆదుకోవాలి..
కొత్త పారిశ్రామికవేత్తలు సంకట స్థితిలో ఉన్నారు. సమగ్ర ప్రాజెక్టు నివేదికలను సిద్ధం చేసుకొని ప్రభుత్వానికి సమర్పించారు. ప్రభుత్వం భూకేటాయింపులు చేసింది. నిర్మాణాలు చేపట్టే సమయంలో కరోనా విపత్తు వచ్చింది. 16 నెలలుగా పారిశ్రామిక రంగం కోలుకోవడం లేదు. బ్యాంకుల నుంచి సాయం అందడం లేదు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆదుకోవాలి. పరిశ్రమల స్థాపనకు రుణసాయం చేసేలా బ్యాంకులకు కేంద్రం ఆదేశాలివ్వాలి. ఎస్‌ఎఫ్‌సీ నుంచి రుణసాయం పెంచాలి.
ఇదీ చూడండి: Dalita Bandu: ఈనెల 16 నుంచి హుజూరాబాద్‌లో దళితబంధు అమలు