హైదరాబాద్‌లోని ఉప్పల్‌కు చెందిన 56 ఏళ్ల వై.లక్ష్మి కుమారి అనే మహిళ.. దంత సంబంధిత సమస్యతో పార్థ డెంటల్ క్లినిక్‌కు వెళ్లారు. ఆమెకు వైద్య పరీక్షలు జరిపి... పీఎఫ్ఎం క్రౌన్స్ చికిత్స చేయాలని చెప్పారు. లక్ష్మి అంగీకరించడం వల్ల చికిత్స చేసి 40 వేల రూపాయల ఫీజు తీసుకున్నారు. అయితే ఆ తర్వాత కూడా నొప్పి ఏ మాత్రం తగ్గకపోగా.. మరింత పెరిగింది. క్లినిక్‌కు వెళ్లగా.. మళ్లీ చికిత్స చేసినప్పటికీ ఫలితం కనిపించలేదు. దీంతో ఫీనిక్స్ డెంటల్ అనే మరో క్లినిక్‌ను సంప్రదించగా.. పరీక్షించిన అక్కడి వైద్య సిబ్బంది.. మొదటి చికిత్స సరిగా జరగలేదని.. మళ్లీ మొదట్నుంచి చేయాల్సి ఉంటుందని సూచించారు. అనుమానం వచ్చిన ఆమె.. ఉస్మానియా డెంటల్ ఆస్పత్రికి వెళ్లారు. అక్కడా అదే చెప్పారు. కంటి సంబంధిత సమస్యలు కూడా తలెత్తడం వల్ల నేత్ర వైద్యుడిని సంప్రదించారు.
ఫీజు తిరిగి ఇచ్చేసిన పార్థ డెంటల్ క్లినిక్
రోజురోజుకీ సమస్య తీవ్రం కావడం వల్ల.. తమ ఫీజు తిరిగి ఇచ్చేయాలంటూ లక్ష్మి కుమారుడు పార్థ డెంటల్ క్లినిక్‌కు మెయిల్ పంపాడు. అంగీకరించిన క్లినిక్ నిర్వాహకులు.. 40 వేల రూపాయలు తిరిగి ఇచ్చేశారు. అయితే తనకు తీవ్ర ఆరోగ్య, మానసిక సమస్యలు కలిగించినందుకు.. 10 లక్షల రూపాయల పరిహారం ఇప్పించాలని కోరుతూ బాధితురాలు వై.లక్ష్మి రంగారెడ్డి జిల్లా వినియోగదారుల ఫోరాన్ని ఆశ్రయించారు. పార్థడెంటల్ క్లినిక్ నిర్ణీత సమయంలో తమ లిఖిత పూర్వక వివరణ సమర్పించలేకపోయింది. లక్ష్మి సమర్పించిన ఆధారాలతో ఫోరం విచారణ జరిపింది.
ప్రిస్కిప్షన్లతో వైద్యుల నిర్లక్ష్యం నిర్ధారించలేం..కానీ
లక్ష్మి సమర్పించిన రికార్డులు.. తీవ్ర నిర్లక్ష్యం జరిగినట్లు నిరూపించడం లేదని ఫోరం పేర్కొంది. కేవలం ప్రిస్కిప్షన్లు, ఆరోపణల ఆధారంగా వైద్య నిర్లక్ష్యం జరిగినట్లు నిర్ధారణకు రాలేమని వినియోగదారుల ఫోరం తెలిపింది. అయితే నిర్లక్ష్యం జరిగినట్లు క్లినిక్ నిర్వాహకులే అంగీకరించి.. 40వేల రూపాయల ఫీజు తిరిగి ఇచ్చారన్న పిటిషనర్ వాదనతో ఫోరం ఏకీభవించింది. ఫీజు తిరిగి ఇచ్చినందున.. సేవా లోపం జరిగి ఉంటుందని భావిస్తున్నామని పేర్కొంది. అయితే ఫీజు ఇప్పటికే తిరిగి ఇచ్చేసినందున.. పరిహారంగా మరో 40వేల రూపాయలు.. పిటిషన్ ఖర్చుల కింద మరో 5వేలు చెల్లించాలని పార్థ డెంటల్ క్లినిక్, ఆస్పత్రి యజమాని డాక్టర్ పీవీ పార్థసారథిని ఆదేశించింది. నెల రోజుల్లో చెల్లించపోతే.. మరో 5వేలు చెల్లించాల్సి ఉంటుందని ఫోరం స్పష్టం చేసింది.
ఇద చదవండి: చితకబాదారు... శిరోముండనం చేశారు!