కొత్త వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలంటూ రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ ముందు కాంగ్రెస్ నేతలు ఆందోళనకు దిగారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. జిల్లా డీసీసీ అధ్యక్షుడు నర్సింహారెడ్డి ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహించారు. కేసీఆర్ తక్షణమే శాసనసభ ఏర్పాటు చేసి చట్టాలకు వ్యతిరేకంగా తీర్మానం చేయాలని కిసాన్ కాంగ్రెస్ జాతీయ ఉపాధ్యక్షుడు కోదండరెడ్డి డిమాండ్ చేశారు. రైతుల పంటలను మద్దతు ధరతో కొనుగోలు చేయాల్సిందేనని నిలదీశారు.
వ్యవసాయ చట్టాలను మొదట వ్యతిరేకించిన తెరాస.. కేసీఆర్ దిల్లీ వెళ్లి వచ్చాక మద్దతు పలుకుతోందని జిల్లా డీసీసీ అధ్యక్షుడు చల్లా నర్సింహారెడ్డి ఆరోపించారు. రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధరలు కల్పించేలా చూడాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉందని ఆయన స్పష్టం చేశారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు పెద్దఎత్తున పాల్గొన్నారు.