రంగారెడ్డి జిల్లా చేవెళ్ల పార్లమెంటు నియోజకవర్గం పరిధిలోని రావిర్యాలలో ‘దళిత, గిరిజన ఆత్మగౌరవ దండోరా’ బహిరంగ సభ కొనసాగుతోంది. తెరాస పాలనలో దళిత, గిరిజన వర్గాలకు జరిగిన అన్యాయాన్ని, మోసాన్ని ఎండగట్టి ప్రజల్లో చైతన్యం నింపేందుకు ప్రతి పార్లమెంటు నియోజకవర్గం పరిధిలో ‘దండోరా’ బహిరంగ సభలను ఏర్పాటు చేయాలని టీపీసీసీ నిర్ణయించింది. ఇందులో భాగంగా రావిర్యాలలో ఇవాళ సభ ఏర్పాటు చేశారు. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ వ్యవహారాల ఇన్‌ఛార్జి మాణికం ఠాగూర్, టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, సీనియర్ నేతలు మల్లు రవి, కోదండరెడ్డి, దాసోజు శ్రవణ్, అద్దంకి దయాకర్ తదితరులు బహిరంగ సభకు హాజరయ్యారు. భారీగా తరలివచ్చిన కాంగ్రెస్ శ్రేణులతో రావిర్యాల జనసంద్రంగా మారింది.
కాంగ్రెస్ ఎస్సీలకు అనేక పదవులు ఇచ్చిందని ఆ పార్టీ నేత అద్దంకి దయాకర్ అన్నారు. దళితుడిని సీఎం చేస్తానని చెప్పిన కేసీఆర్... ఇప్పుడు కొత్తగా దళితబంధు అంటూ మోసం చేస్తున్నారని విమర్శించారు.
హుజూరాబాద్‌లో తప్ప ఎక్కడా దళితబంధు అడగకుండా చేస్తున్నారు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన భూములను తెరాస లాక్కుంటోంది. పేదలకు రూ.2- 5 లక్షలు చెల్లించి భూములు లాక్కుంటున్నారు. పేదల భూములను పారిశ్రామిక వేత్తలకు కోట్లలో అమ్ముకుంటున్నారు. ఏడేళ్లల్లో ఎన్ని ఉద్యోగాలు భర్తీ చేశారో మంత్రి కేటీఆర్ చెప్పాలి. అటెండర్ తల్లిదండ్రులకు కూడా వృద్ధాప్య పింఛను రద్దు చేశారు. రాష్ట్రంలో మద్యం మీద రూ.30 వేల కోట్లకు పైగా ఆదాయం వస్తోంది.
-సీతక్క, ములుగు ఎమ్మెల్యే
ఇదీ చదవండి: రసాయనాలతో కూడిన విగ్రహాలు నిమజ్జనం చేయకుండా చర్యలేంటి?: హైకోర్టు