కార్పోరేట్, ప్రైవేట్ పాఠశాలల్లో ఆన్లైన్ తరగతులు, ఫీజుల ఒత్తిడిపై.. సినీ నటుడు శివబాలాజీ రంగారెడ్డి జిల్లా విద్యాధికారికి ఫిర్యాదు చేశారు. స్కూల్ యాజమాన్యం ఆన్లైన్ తరగతుల పేరుతో విద్యార్థులను అనేక ఇబ్బందులకు గురిచేస్తున్నారని... అధిక ఫీజులు వసూలు చేస్తున్నారని ఆయన డీఈవో విజయలక్ష్మికి వివరించారు. పెంచిన ఫీజులు తగ్గించాలని కోరితే ఎలాంటి సమాచారం లేకుండా... తమ పిల్లలను ఆన్లైన్ తరగతుల నుంచి తొలగించారని పేర్కొన్నారు. ఇలా అనేకమంది విద్యార్థుల తల్లిదండ్రులు ఇబ్బందులకు గురవుతున్నారన్నారు.
పాఠశాల యాజమాన్యం విద్యార్థుల పట్ల ఇలా వ్యవహరించడంపై చర్యలు తీసుకోవాలని కోరారు. హెచ్చార్సీలో ఫిర్యాదు చేసిన తర్వాత పిల్లలను తిరిగి ఆన్లైన్ తరగతులకు అనుమతి ఇచ్చారని తెలిపారు. అకారణంగా తరగతుల నుంచి ఎందుకు తొలగించారని అడిగితే.. సాంకేతిక సమస్య వల్ల అలా జరిగిందంటూ నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చారని ఆవేదన వ్యక్తం చేశారు. మౌంట్ లిటేరా జీ పాఠశాల నిబంధనలకు విరుద్ధంగా ఫీజులు వసూళ్లు చేస్తున్న విషయం... ఆన్లైన్ తరగతుల నిర్వహణకు సంబంధించిన వివరాలు డీఈవోకు ఇచ్చామని తెలిపారు. ఈ విషయంలో పాఠశాల గుర్తింపు రద్దయ్యేవరకు పోరాడుతామని స్పష్టం చేశారు.
ఇదీ చదవండిః యాదాద్రిలో భక్తుల ఆహ్లాదం కోసం వాటర్ ఫౌంటైన్‌లు