హైదరాబాద్ నగర శివారులో 21 మున్సిపాలిటీలు, 7 నగరపాలకసంస్థల్లో ఇంటి నిర్మాణ అనుమతుల జారీ ప్రక్రియ నిలిచిపోయింది. ప్రతిచోట 200-300 దరఖాస్తులు పెండింగులో ఉన్నాయి. డీటీసీపీ(డైరెక్టర్ ఆఫ్ టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్) అనుమతి అవసరమైన మున్సిపాలిటీల్లోనే సమస్య ఏర్పడింది.
ఎందుకీ సమస్యంటే..
ఆన్‌లైన్‌లో భవన నిర్మాణ అనుమతులు జారీ చేసేందుకు గతంలో ‘అభివృద్ధి అనుమతి నిర్వహణ వ్యవస్థ’ (డీపీఎంఎస్)ను ప్రభుత్వం తీసుకువచ్చింది. ఆటో డీసీఆర్(డ్రాయింగ్ కంప్లైన్స్ విత్ రిలవెంట్ రెగ్యులేషన్స్) వ్యవస్థ ద్వారా జారీ చేసే వెసులుబాటు కల్పించింది. మున్సిపాలిటీల్లో ఇళ్ల నిర్మాణాలకు దరఖాస్తుదారులు లైసెన్స్‌డ్ సర్వేయర్ నుంచి ఆన్‌లైన్‌లో అర్జీలు సమర్పించాలి. అక్కడి నుంచి ఇళ్ల నిర్మాణ ప్రణాళిక సవ్యంగా ఉందో లేదో పరిశీలించేందుకు డీటీసీపీ ద్వారా ప్రైవేటు కన్సల్టెన్సీకి వెళుతుంది. ఈ కన్సల్టెన్సీని సాఫ్ట్‌టెక్ కంపెనీ నిర్వహిస్తోంది. ప్రభుత్వం తనకు నిధులు చెల్లించకపోవడంతో 75 రోజులుగా దరఖాస్తుల పరిశీలన ప్రక్రియను ఆ కంపెనీ నిలిపివేసింది.
5600 అర్జీలు పెండింగ్‌లో
నిర్మాణదారులు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు సమర్పించినా.. పరిశీలన దశలోనే ఉన్నట్లు కనిపిస్తోంది. డీపీఎంఎస్‌కు సంబంధించి యూజర్‌ఐడీ, పాస్‌వర్డులు వంటివి ఆ కంపెనీ వద్దే ఉండటంతో దరఖాస్తులు కదలని పరిస్థితి. హైదరాబాద్ శివారుల్లో జి+5 వరకు మున్సిపాలిటీల ద్వారానే డీటీసీపీ నుంచి అనుమతులు జారీ చేస్తున్నారు. అంతకంటే ఎక్కువ ఉన్నవి, గేటెడ్ కమ్యూనిటీలకు హెచ్‌ఎండీఏ నుంచి అనుమతులు వస్తుంటాయి. ప్రస్తుతం జి+5 లోపు నిర్మాణాలకు చేసుకున్న దరఖాస్తులన్నీ ఆగిపోయాయి. రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లోని మున్సిపాలిటీల్లోనే 5600 వరకు అర్జీలు పెండింగులో ఉన్నాయని సమాచారం.
ఇదీ చదవండి: స్వచ్ఛమైన గాలి.. మట్టివాసన... ఫామ్‌టూర్స్‌కు నగరవాసులు