తుక్కుగూడ మున్సిపాలిటీ ఛైర్ పర్సన్ ఎన్నికల్లో రాజ్యసభ సభ్యుడు కె.కేశవరావు ఎక్స్ అఫిషియో ఓటు వేయడంపై భాజపా... హైకోర్టును ఆశ్రయించింది. ఏపీ కోటాలో ఎన్నికైన కేకే ఓటు చెల్లదని ప్రకటించాలని కోరుతూ భాజపా కౌన్సిలర్లు వ్యాజ్యం దాఖలు చేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు కేశవరావు రాజ్యసభకు ఎన్నికయ్యారని.. అయితే ఆయన ఏపీ కోటా కింద ఎన్నికైనట్లు 2014లో ప్రకటించారని పిటిషన్లో పేర్కొన్నారు.
రాజ్యసభ సభ్యుడు గరికపాటి రామ్మోహన్ రావు ఎక్స్ అఫిషియో ఓటుతో.. తమ పార్టీ సభ్యులు ఛైర్మన్, వైస్ ఛైర్మన్గా ఎన్నికయ్యే పరిస్థితులు ఉన్న సమయంలో మున్సిపల్ కమిషనర్... కేకే ఓటుకు అనుమతించారని ఆరోపించారు. తెరాస ఒత్తిడితో మున్సిపల్ ఎన్నికల అధికారి చట్ట విరుద్ధంగా వ్యవహరించారని తెలిపారు. పిటిషన్లో కేకేతో పాటు పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి, రాష్ట్ర ఎన్నికల అధికారి, రంగారెడ్డి జిల్లా కలెక్టర్, మున్సిపల్ ఎన్నికల అధికారి రాజేశ్వర్ రెడ్డి, ఛైర్మన్ మధుమోహన్, వైస్ ఛైర్మన్ వెంకటరెడ్డిని ప్రతివాదులుగా పేర్కొన్నారు.
ఇవీ చూడండి: 'మానసిక క్షోభతో ఉరేసుకుని ఆత్మహత్య'