గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం విడుదల చేస్తున్న నిధులను రాష్ట్ర ప్రభుత్వం పక్కదారి పట్టిస్తోందని భాజపా ఎమ్మెల్సీ రామచంద్రరావు ఆరోపించారు. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం అల్లాడ గ్రామంలో ఎమ్మెల్సీ నిధులు రూ.5 లక్షలతో చేపట్టిన సీసీ రోడ్డు పనులను ఆయన ప్రారంభించి.. భాజపా పార్టీ జెండా ఆవిష్కరించారు.
చేసిందేమీ లేదు..
గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం నిధులు విడుదల చేస్తుంటే రాష్ట్ర ప్రభుత్వం తామే నిధులు విడుదల చేస్తున్నట్లు ప్రచారం చేస్తోందని రామచంద్రరావు ఆరోపించారు. గ్రామాల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం చేసిందేమీ లేదని... కనీసం కొన్ని నిధులైనా విడుదల చేయడం లేదని ఆయన ఆరోపించారు.
ఆర్థిక సంఘం నిధులను కేంద్రం విడుదల చేస్తూ ఉంటే.. ఆ నిధుల నుంచి కరెంటు బిల్లులు కట్టించుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత భాజపా నాయకులు, కార్యకర్తలపై ఉందన్నారు. రైతుల మేలు కోసం కేంద్ర ప్రభుత్వం కొత్త వ్యవసాయ చట్టాలు తీసుకువస్తే దానిపై ప్రతిపక్షాలు అనవసరంగా రాద్ధాంతం చేస్తున్నాయని మండిపడ్డారు.
పట్టభద్రుల ఎన్నికలకు సిద్ధం కావాలి
రానున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల కోసం కార్యకర్తలు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. భాజపా అభ్యర్థి గెలుపు కోసం ఇప్పటి నుంచే ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగాలని సూచించారు. ఈ కార్యక్రమంలో చేవెళ్ల మండల భాజపా అధ్యక్షుడు దేవర పాండురంగారెడ్డి, భాజపా నాయకులు, కార్యకర్తలు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.
ఇదీ చూడండి: టైర్ పేలింది.. బోల్తా పడింది