ప్రజల సమస్యలకు పక్కనబెట్టి సీఎం కేసీఆర్... ఫామ్ హౌస్‌కే పరిమితమయ్యారని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఎద్దేవా చేశారు. రంగారెడ్డి జిల్లా చేవేళ్లలో పర్యటించిన బండి సంజయ్‌కు పార్టీ కార్యకర్తలు ఘనంగా స్వాగతం పలికారు. బస్టాండ్ ముందు పార్టీ జెండా ఎగరేసిన సంజయ్... సర్కారు వైఫల్యాలను ప్రజల మధ్య ఎండగట్టాలని పార్టీ శ్రేణులకు సూచించారు.
అభివృద్ధి కార్యక్రమాల పేరుతో కోట్ల రూపాయలు వెనకేసుకున్న ముఖ్యమంత్రి కేసీఆర్ అవినీతి బండారాన్ని బయటపెట్టి జైలుకు పంపుతామన్నారు. భాజపా కార్యకర్తలకు ఏ కష్టం వచ్చినా అండగా నిలబడతామని బండి సంజయ్ భరోసా ఇచ్చారు. రానున్న ఎన్నికల్లో రాష్ట్రంలో భాజపా అధికారాన్ని చేపడుతుందని... గోల్కొండ కోటపై జెండా ఎగురవేస్తామని ధీమా వ్యక్తం చేశారు.