Bandi Sanjya Comments On Kcr: తెరాస పాలనలో రాష్ట్రం సమస్యల వలయంలో కూరుకుపోయిందని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. ప్రజలకు, మీడియాకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో సీఎం కేసీఆర్ పూర్తిగా విఫలమయ్యారని ఆరోపించారు. బండి సంజయ్ ప్రారంభించిన రెండో విడత ప్రజా సంగ్రామ యాత్ర కేశంపేట మండలంలో రెండో రోజు కొనసాగింది. ఉద్యమ సమయంలో, అధికారంలోకి వచ్చాక జర్నలిస్టులకు ఇళ్లు ఇస్తామన్న తెరాస... విస్మరించిందన్నారు.
ఉద్యమానికి పత్రికలు ఇచ్చిన మద్దతు వల్ల రాష్ట్రం ఏర్పడిందని బండి సంజయ్ అన్నారు. కేసీఆర్ అధికారంలోకి వచ్చాక మీడియాకు తగిన గుర్తింపు లభించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కరోనా సమయంలో మీడియా చేసిన కృషి అనిర్వచనీయమన్నారు. భాజపా అధికారంలోకి వచ్చాక మొదటి ప్రాధాన్యత మీడియాకు ఇస్తుందని హామీ ఇచ్చారు. అధికారంలో రాగానే మీడియా ప్రతినిధుల అందరికీ ఇళ్ల స్థలాలు ఇస్తామన్నారు. లక్ష్మీదేవిపల్లి ప్రాజెక్టు పూర్తి చేస్తే భూములు సస్యశ్యామలమవుతాయన్నారు.
తక్కువ ధరలకే ఇక్కడి భూములు కొనాలన్న సీఎం కుట్రతో లక్ష్మీదేవిపల్లి ప్రాజెక్టును నిర్మించడం లేదని బండి అన్నారు. అనంతరం కొత్తపేట వరకు పాదయాత్ర నిర్వహించారు. కొత్తపేటలో జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. సంతాపూర్‌లో అంగన్వాడీ భవనానికి ఎంపీ నిధుల నుంచి రూ. 5 లక్షలు ఇస్తున్నట్లు తెలిపారు. సీఎం కేసీఆర్ ఫామ్‌హౌజ్‌కే పరిమతిమవుతున్నారన్న బండి సంజయ్.... ప్రజల్లో తిరిగే భాజపాను వచ్చే ఎన్నికల్లో గెలిపించాలని కోరారు. గతంలో అధికారంతో ప్రజల డబ్బులు దోచుకున్న తెరాస, కాంగ్రెస్ నాయకులు ఇచ్చే డబ్బులు తీసుకోవాలని సూచించిన సంజయ్... ఓటు మాత్రం భాజపాకే వేయాలని కోరారు.
జర్నలిస్టులను నిండా ముంచింది కేసీఆరే. ఇండ్ల స్థలాలు ఇస్త అని చెప్పగానే పాలాభిషేకాలు చేస్తిరి. ఉద్యమ కాలంలో అండగా నిలిచిన జర్నలిస్టు సోదరులను విస్మరించిండు. కేసీఆర్ హయాంలో మీడియాకు గుర్తింపు లేదు. మేం అధికారంలోకి రాగానే జర్నలిస్టులకు అధిక ప్రాధాన్యమిస్తాం. మీడియా ప్రతినిధుల అందరికీ ఇళ్ల స్థలాలు ఇస్తాం. -- బండి సంజయ్
ఇవీ చదవండి: ఆగని ఆగ్రహజ్వాల.. శ్రీలంక భవిష్యత్ ఏంటి? భారత్ ఏం చేయనుంది?
Asani Cyclone Effect on AP : నేలరాలిన పంటలు.. తడిసిముద్దయిన ధాన్యం