Director Sukumar Went To KIMS Hospital For Sreetej : కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొంతున్న బాలుడు శ్రీతేజ్‌ను సినీ దర్శకుడు సుకుమార్ పరామర్శించారు. ఆయన ఆరోగ్య పరిస్థితిపై వైద్యులతో చర్చించారు. మధ్యాహ్నం ఆసుపత్రికి వెళ్లిన సుకుమార్.. బాలుడి తండ్రి, వైద్యులతో మాట్లాడారు. శ్రీతేజ్‌కు అండగా ఉంటామని తండ్రికి భరోసా ఇచ్చారు.
హైదరాబాద్‌లోని ఆర్టీసీ క్రాస్‌రోడ్‌లో పుష్ప-2 బెనిఫిట్ షో సందర్భంగా సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే మహిళతో పాటు ఆమె కుమారుడు శ్రీతేజ్‌కు తీవ్రంగా గాయపడ్డారు. రేవతి అదేరోజు చనిపోగా శ్రీతేజ్‌ను చికిత్స నిమిత్తం ముందుగా నిమ్స్‌కు అక్కడి నుంచి కిమ్స్‌కు తరలించారు. గత 2 వారాలుగా బాలుడు కిమ్స్ ఆసుపత్రిలోనే చికిత్స పొందుతున్నాడు. తొక్కిసలాటలో బాలుడి మెదడుకు గాయాలు అవడంతో సరిగా స్పందిచండం లేదని వైద్యులు చెబుతున్నారు. రెండురోజుల క్రితం సీపీ సీవీ ఆనంద్ కూడా కిమ్స్ ఆసుపత్రికి వెళ్లి శ్రీతేజ్ ఆరోగ్యం గురించి ఆరా తీశారు. త్వరలోనే వైద్యులు అతని కండీషన్‌పై బులిటెన్ విడుదల చేస్తారని ప్రకటించారు.
మరోవైపు శ్రీతేజ్‌ను పరామర్శిస్తానని హీరో అల్లు అర్జున్ కూడా ప్రకటించారు. ఇదే సమయంలో సంథ్య థియేటర్ కేసులో ఈనెల 13న అరెస్ట్ చేయడం, ఆయనను చంచల్ గూడ జైలుకు తరలించడం, మరుసటి రోజు ఉదయం విడుదల కావడంతో శ్రీతేజ్‌ను పరామర్శించడం ఆలస్యమైంది. త్వరలోనే తాను కిమ్స్‌కు వెళ్లి కలుస్తానని గత శనివారం అల్లు అర్జున్ ప్రకటించారు.