వ్యవసాయ ఆవిష్కరణలను ప్రోత్సహించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన అగ్రిహబ్.. రైతులకు అందుబాటులోకి వచ్చింది. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్‌లోని ఆచార్య జయశంకర్ వర్సిటీలో ఏర్పాటు చేసిన అగ్రిహబ్ భవనాన్ని మంత్రులు కేటీఆర్, సబితా ఇంద్రారెడ్డిలతో కలిసి వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి ప్రారంభించారు. రూ. 9కోట్ల నాబార్డ్ నిధులతో అగ్రిహబ్ రూపుదిద్దుకుంది.
అగ్రిహబ్ భవనంలో 14 స్టార్టప్ కంపెనీల కార్యకలాపాలు కొనసాగుతాయి. దీని ద్వారా సాంకేతిక పరిజ్ఞానంతో రైతులు వ్యవసాయం చేసేలా శిక్షణ ఇస్తారు. రైతు సహకార సంఘాల ఏర్పాటును ప్రోత్సహించడంతో పాటు వాటిలో సభ్యులుగా ఉండే రైతులకు ఇందులో శిక్షణ ఇవ్వనున్నారు. అగ్రిహబ్‌కు అనుబంధంగా గ్రామీణ యువతకు చేరువలో జగిత్యాల, వరంగల్, వికారాబాద్‌లో అగ్రిటెక్ ఇన్నోవేషన్ కేంద్రాలుంటాయి. వినూత్న ఆలోచనలతో వచ్చే గ్రామీణ యువతను ప్రోత్సహించి అగ్రిహబ్‌కు తీసుకొస్తారు.
అగ్రిహబ్ ఏర్పాటుతో వ్యవసాయరంగానికి ఎంతో మేలు జరగనుంది. వినూత్న ఆలోచనలతో వచ్చేవారిని అంకుర సంస్థల సహకారంతో పరికరాల రూపంలోకి తీసుకొచ్చి రైతుల వద్దకు చేర్చేందుకు ఉపయోగపడనుంది. వర్సిటీ విద్యార్థులు, అధ్యాపకులతో పాటు ఔత్సాహిక అన్నదాతలకు అగ్రిహబ్ నాలెడ్జ్ సెంటర్‌గా పనిచేస్తుంది. వ్యవసాయ వాణిజ్యం వైపు యువతను మళ్లించేందుకు దోహదపడనుంది.
ఇదీ చదవండి: BANDI SANJAY: భాజపా ఎప్పటికీ తెరాసతో కలిసి పోటీ చెయ్యదు