హైదరాబాద్ కర్మాన్‌ఘాట్ పరిధిలో నివాసముంటున్నారు చిత్రకారులు ఆడెపు శ్రీకాంత్ బాబు (Adepu Srikanth Babu). కుంచె పట్టారంటే ఏ చిత్రమైనా కాన్వాస్‌పై ప్రాణం పోసుకుంటుంది. దేవుళ్ల చిత్రాలైతే కళ్లముందే ఉన్నారా అన్నంత కనికట్టు చేస్తాయి. పాతికేళ్లుగా ఈ రంగంలో అనేక గుర్తింపులు అందుకున్నారాయన. 2017 డిసెంబర్ 1 నుంచి 15 వరకు స్టేట్ ఆర్ట్ గ్యాలరీలో 10 వేల పెయింటింగ్స్ ప్రదర్శనతో అతిపెద్ద కళా ప్రదర్శనకు గానూ హైరేంజ్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు దక్కించుకున్నారు శ్రీకాంత్.
ఇంటినే పైకెత్తి...
చాలావరకు చిత్రాలను ఎందరో ప్రముఖులు కొనుక్కోగా మిగిలిన చిత్రాలన్నింటినీ ఇంట్లోనే భద్రపరుచుకున్నారు. అనుకోకుండా 2020 అక్టోబరులో వచ్చిన ఉపద్రవం వాటన్నిటినీ నీట ముంచేసింది. దాదాపు 3 వేల చిత్రాలు నీటిలో మునిగిపోయాయి. కాన్వాసులు చెదిరిపోయాయి. తీవ్ర నష్టం వాటిల్లింది. దాని నుంచి తేరుకున్న శ్రీకాంత్ బాబు ఇంటి కోసం ఆలోచనలు మొదలుపెట్టారు. అప్పుడే జాకీ సాంకేతికతతో ఇంటిని పైకి ఎత్తేయొచ్చని తెలుసుకున్నారు. హరియాణకు చెందిన ఓ హౌజ్ లిఫ్టింగ్ బృందంతో మాట్లాడి 2నెలల క్రితం పనులు మొదలుపెట్టారు.
ముంపు సమస్యను అధిగమించేందుకు...
కొత్త ఇల్లు కట్టాలంటే భారీ ఖర్చు. అందుకు ప్రత్యామ్నాయ దారిలో లిఫ్టింగ్ ద్వారా దాదాపు రూ.5 లక్షల్లో ఈ ఇంటిని పైకి ఎత్తి ముంపు సమస్య తీర్చుకోవచ్చని చెబుతున్నారు శ్రీకాంత్ బాబు. దాదాపు 15 మంది సిబ్బంది 2 నెలలుగా నిర్విరామంగా పని చేస్తున్నారు. ఇంకో నెలరోజుల్లో ఇంటి పని పూర్తవుతుందని చెబుతున్నారాయన. రోడ్డుకు దిగువగా ఉండటంతో ఎలాగో వేరే దారి లేదు. సరైన డ్రైనేజీ వ్యవస్థలూ లేకపోవడం వల్ల ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇదే దారి అంటున్నారు. ఎంతో ప్రాణం పెట్టి గీసిన బొమ్మలన్నీ ఇలా నీటి పాలవుతాయని ఎప్పుడూ అనుకోలేదని.. గుండె బద్దలైనంత పనైందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఇవీ చూడండి: Engineering colleges: రాష్ట్రంలో 85,149 ఇంజినీరింగ్ సీట్లకు అనుమతి