111 GO Effect in Rangareddy District: 111 జీవో.. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల, రాజేంద్రనగర్ నియోజకవర్గాల్లోని 84 గ్రామాల ప్రజల నోళ్లలో బాగా నానే పేరు ఇది. ఎన్నికల వేళ.. అధికార, ప్రతిపక్షాలకు ఈ రెండు నియోజకవర్గాల్లోని ప్రజల ఓట్లను ఆకర్షించేందుకు ఆయుధంగా మారిన జీవోగా కూడా ఇది గుర్తింపు పొందింది. నగర శివార్లలోని ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ జంట జలాశయాల పరిరక్షణ కోసం తీసుకొచ్చిన ఈ జీవో చుట్టూ పెద్దఎత్తున రాజకీయాలు నడిచాయి.
111 GO Effect On 84 Villages: కానీ, ప్రజలకు చేకూరిన ప్రయోజనాలకంటే రాజకీయ పార్టీలకు, స్థిరాస్తి వ్యాపారులకే ఈ జీవో వల్ల ఎక్కువ లబ్ధి జరిగింది. ఈ జీవోపై న్యాయస్థానాల్లో గట్టిగానే పోరాటం సాగింది. కానీ, గతేడాది ఈ ప్రాంత ప్రజల డిమాండ్‌కు రాష్ట్ర ప్రభుత్వం తలొగ్గి.. 111 జీవోను ఎత్తివేస్తున్నట్లు అసెంబ్లీ సాక్షిగా ప్రకటించింది. ఆ జీవోలో ప్రజలకు ఇబ్బందిగా మారిన 3వ పేరాను సవరిస్తూ.. కొత్తగా జీవో 69ను జారీ చేసింది.
భూముల విలువ రెండు రెట్లు అధికం: ఇన్నాళ్లు తమకు అడ్డుగోడగా నిలిచిన 111 జీవో నుంచి విముక్తి కలిగిందని ప్రజలంతా సంబురపడ్డారు. అప్పటి వరకు అంతంత మాత్రంగానే ఉన్న భూముల క్రయ విక్రయాలు, నిర్మాణాలు ఒక్కసారిగా ఊపందుకున్నాయి. భూముల విలువ కూడా రెండు రెట్లు పెరిగింది. కానీ, ఈ హడావిడి అంతా నెలరోజుల్లోనే ఆవిరైంది. కొత్తగా జారీ చేసిన జీవోలో విధి విధానాలు స్పష్టంగా లేకపోవడమే ఇందుకు కారణమని తెలుస్తోంది.
111 to 69 GO Effect In Rangareddy District: 111 జీవోను సవరించి.. 69 జీవోను జారీ చేసిన సమయంలో ప్రభుత్వం హైదరాబాద్ నగర తాగునీటి అవసరాలను రెండు జలాశయాలు 27.59 శాతం తీర్చవచ్చని చెప్పింది. రోజుకు 145 మిలియన్ గ్యాలన్ల నుంచి 602 మిలియన్ గ్యాలన్ల నీరు అవసరమవుతుందని కూడా తెలిపింది. అయితే, ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో 1.25 శాతం కంటే తక్కువున్న పరిస్థితుల్లో హైదరాబాద్ తాగునీటి అవసరాలకు ఇది ఆధారం కాబోదని వివరించింది.
111 GO Impact On 84 Villages: వీటితో పాటు జంట జలాశయాల్లో నీటి నాణ్యత ఎట్టి పరిస్థితుల్లోనూ దెబ్బతినరాదని షరతు విధించింది. నీటి నాణ్యత మెరుగుపర్చేందుకు వివిధ ప్రాంతాల్లో ఎస్టీపీలు నిర్మించడం, జలాశయాల్లోకి నీరు వెళ్లేలా డైవర్షన్ ఛానళ్ల నిర్మాణం, భూగర్భ జలాల నాణ్యత పరిరక్షణ, కాలుష్య తీవ్రత తగ్గింపు తదితర చర్యలు తీసుకోవాలని స్పష్టం చేసింది. జీవో 69 తీసుకువచ్చిన తర్వాత చేపట్టాల్సిన చర్యల కోసం విధివిధానాల రూపకల్పన, సమగ్ర మార్గదర్శకాల కోసం కమిటీని కూడా ప్రభుత్వం ఏర్పాటు చేసింది.
ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నేతృత్వంలో పురపాలక, ఆర్థిక, నీటిపారుదల శాఖల ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు, జలమండలి ఎండీ, పీసీబీ సభ్య కార్యదర్శి, హెచ్ఎండీఏ ప్లానింగ్ డైరెక్టర్ సభ్యులుగా ఓ కమిటీని ఏర్పాటు చేశారు. ఆ కమిటీ జలాశయాల పరిరక్షణ, కాలుష్య నిరోధానికి చర్యలు చేయాలి. అలాగే, గ్రీన్ జోన్లు.. సహా జోన్ల నిర్ధారణ కోసం విధివిధానాలను కూడా సిఫారసు చేయాల్సి ఉంటుంది.
జంట జలాశయాల్లోకి మురుగునీరు చేరకుండా చూడాలి: ట్రంక్ వ్యవస్థ అభివృద్ధి కోసం మార్గదర్శకాలు, రహదార్లు, డ్రైన్లు, ఎస్టీపీలు, డైవర్షన్ డ్రైన్ల నిర్మాణం కోసం నిధుల సమీకరణ మార్గాలను చూపాల్సి ఉంటుంది. వసతుల కల్పన, నియంత్రిత అభివృద్ధి కోసం వ్యవస్థ ఏర్పాటు, లే అవుట్‌లు, భవన అనుమతుల కోసం నియంత్రణా చర్యలు సూచించాలి. జంట జలాశయాల్లోకి మురుగునీరు చేరకుండా చూడటంతో పాటు.. ఈ ప్రాంతంలో మౌలికవసతుల కల్పన కోసం నిధుల సమీకరణ మార్గాలపై కూడా కమిటీ దృష్టి సారించాల్సి ఉంది.
69 జీవో వచ్చి ఏడాది గడిచినా ఎలాంటి అధ్యయనం చేయలేదు: దీనిపై వీలైనంత త్వరగా నివేదిక ఇవ్వాలని 69వ జీవోలో కమిటీ ఆదేశించింది. 69 జీవో వచ్చి ఏడాది గడిచినా కమిటీ ఎలాంటి అధ్యయనం చేయలేదని రైతులు ఆరోపిస్తున్నారు. జీవో పరిధిలోకి వచ్చే లక్షా 32 వేల ఎకరాల భూముల్లో ఎక్కడి వరకు గ్రీన్ జోన్, ఎక్కడి వరకు ఫ్రీ జోన్ అనేది స్పష్టత లేదని అంటున్నారు. మురుగునీటి శుద్ధి కేంద్రాల విషయంలో శంకర్‌పల్లి మండలంలోని బుల్కాపూర్, మహరాజ్ పేట, జన్వాడ గ్రామాల్లో స్థలాలను గుర్తించారు.
కానీ, నిర్మాణంలో ఎలాంటి పురోగతి లేదు. జీవోలో స్పష్టమైన విధి విధానాలు లేకపోవడంతో గత పరిస్థితులే ప్రస్తుతం కూడా నెలకొన్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. భూముల రిజిస్ట్రేషన్లు ఆగిపోయాయని, బ్యాంకర్లు కూడా తమకు రుణాలు ఇవ్వడం లేదని వాపోతున్నారు. రైతుల వాదన ఇలా ఉంటే.. స్థిరాస్తి వ్యాపారులకు మాత్రం 69 జీవో కోట్లు కుమ్మరించింది.
111 జీవో నిబంధనలు అడ్డురావడంతో భూముల క్రయ విక్రయాలు బంద్: ఈ జీవో రాకముందే రూ.కోటి పలికిన ఎకరం ధర.. ఇప్పుడు ఏకంగా 3 నుంచి 4 కోట్లు పలుకుతుందని వ్యాపారులు చెబుతున్నారు. అయితే రిజిస్ట్రేషన్లకు 111 జీవో నిబంధనలు అడ్డురావడంతో భూముల క్రయ విక్రయాలు ఆగిపోతున్నాయని అంటున్నారు. ఫలితంగా నష్టపోవాల్సి వస్తుందని స్థిరాస్తి వ్యాపారులు చెబుతున్నారు. 111 జీవో అమల్లో ఉండగానే మొయినాబాద్, శంకర్ పల్లి మండలాల్లో పెద్ద ఎత్తున సినీ, రాజకీయ, వ్యాపార రంగాలకు చెందిన ప్రముఖులు భూములు కొనుగోలు చేశారు. ఇక్కడ ఫాంహౌస్‌లు, విల్లాలు నిర్మించుకున్నారు.
అధిక ధర ఆశ చూపి.. భూములు కొనుగోలు చేసి: జంట జలాశయాలకు వరదనీరు వచ్చే ప్రాంతాల్లో కొన్ని చోట్ల భూములు అన్యాక్రాంతమయ్యాయి. మరికొన్ని చోట్ల పలువురు రైతులకు అధిక ధర ఆశ చూపి పంట భూములను కొనుగోలు చేశారు. ఇలాంటి సమయంలో జీవోను పకడ్బందీగా అమలు చేయాల్సిన అధికార యంత్రాంగం చూసి చూడనట్లు వ్యవహరించింది. మరోవైపు 111 జీవోను ఎత్తివేసి గండిపేట, హిమాయత్ సాగర్‌ల రూపురేఖలను మార్చేందుకు రాజకీయ కుట్ర చేశారనే విమర్శలు వ్యక్తం అయ్యాయి.
'ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ చుట్టూ పక్కల భూముల ధరలు విపరితంగా పెరిగిపోతున్నాయి. కొంచం భూమి ఉన్న వారు లాభపడుతున్నారు. కానీ, ఈ 84 గ్రామాల వాళ్లకు 111 జీవో అడ్డం వస్తుంది. రిజిస్ట్రేషన్లు కావడం లేదు. అయినా కనీ, ధరలు మొదట్లో పెరిగినా.. అలాగే ఉండిపోయాయి'. -పద్మనాభరెడ్డి, సుపరిపాలన వేదిక కార్యదర్శి
జీవోల రద్దు, మార్పు పేరుతో పార్టీలు రాజకీయం చేస్తున్నాయని, నీటి వనరులు, ప్రజల సంక్షేమం, అభివృద్ధిని మరిచి ఓట్ల కోసం ప్రకృతి విధ్వంసానికి పాల్పడుతున్నారని పలువురు పర్యావరణవేత్తలు, విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. కమిటీ వెంటనే ఈ ప్రాంతంలో అధ్యయనాన్ని పూర్తి చేసి జంట జలాశయాల పరిరక్షణతోపాటు 84 గ్రామాల ప్రజల కష్టాలను దూరం చేయాలని కోరుతున్నారు.
యంత్రాంగం నిమ్మకు నీరెత్తినట్లు ఉన్నారు: జంట జలాశయాల పరిరక్షణ కోసం ఉద్దేశించిన జీవో పాలకుల అలసత్వం, అధికార యంత్రాంగం కాలయాపన వల్ల పక్కదారి పడుతోందని ప్రజలు విమర్శిస్తున్నారు. సమగ్ర ప్రణాళికలను రూపొందించాల్సిన యంత్రాంగం నిమ్మకు నీరెత్తినట్లు ఉండటంతో స్వార్థపరుల ఆకృత్యాలకు గండిపేట, హిమాయత్ సాగర్ జలాశయాలు ఉనికి కోల్పోయే ప్రమాదం ఉందని అంటున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం 69వ జీవోను సమగ్రంగా అమలు చేసి తమకు అండగా ఉండాలని రైతులు వేడుకుంటున్నారు.
'69 జీవో తీసుకురావడం రైతులు, బిజినెస్ చేసే వారికి మంచిదే. దానికి ఒక చట్టం తేవాలి. ఆ చట్టంలో ఏ గ్రామం నుంచి ఏ గ్రామం వరకు ఈ లే అవుచ్ చేయవచ్చు. 69 జీవో తెచ్చి దానికి విధి విధానం లేనప్పుడు రియల్ఎస్టేట్, రైతులు నష్టపోతారు'. -ప్రభాకర్ రెడ్డి, శ్రీరామ్‌నగర్ సర్పంచ్
ఇవీ చదవండి:
Foreign Education: 'స్టడీ ఇండియా పేరుతో విదేశీ విద్యను అభ్యసించే వారికి రుణాలు'
students Work in Mahbubabad: స్కూల్ పిల్లలే.. అక్కడ పని పిల్లలు
Yadadri Temple: హైందవ సంస్కృతిని ప్రతిబింబించేలా యాదాద్రిలో శిలాఫలకం