వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయాన్ని రూ. 400 కోట్లతో అభివృద్ధి చేస్తామని సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీ ఇప్పటివరకు కార్యరూపం దాల్చలేదని టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు పొన్నం ప్రభాకర్ విమర్శించారు. రాజన్న ఆలయంలో పొన్నం ప్రభాకర్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అమరవీరుల స్తూపం వద్ద భారత్-చైనా సరిహద్దులో మృతి చెందిన కల్నల్ సంతోశ్ బాబు చిత్రపటానికి నివాళులర్పించారు.
రాజన్న ఆలయ అభివృద్ధిపై రంగురంగుల బొమ్మలు చూపిస్తూ కాలం వెళ్లదీస్తున్నారని పొన్నం మండిపడ్డారు. అభివృద్ధి పేరుతో ఉన్న చెరువు పూడ్చి వేయటం వల్ల నీటి ఎద్దడి ఏర్పడిందన్నారు. రాష్ట్రంలో అతిపెద్ద దేవాలయమైన రాజన్న ఆలయానికి పాలకమండలి ఎందుకు వేయలేదని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. మరోవైపు స్థానిక ఎమ్మెల్యే మాత్రం దేశం విడిచి జర్మనీలో ఉంటున్నాడని పొన్నం ప్రభాకర్ ఎద్దేవా చేశారు.