రాష్ట్రంలో ఎస్సీలకు ఇచ్చిన భూములెన్నో.. వారి నుంచి లాకున్నవెన్నో.. అసెంబ్లీ(Telangana assembly sessions 2021) సాక్షిగా శ్వేత పత్రం విడుదల చేయాలని భాజపా ఎమ్మెల్యేలు(Bjp Telangana MLAs) డిమాండ్ చేశారు. దళిత బంధు పథకం హుజూరాబాద్‌లోనే ఎందుకు అమలు చేస్తున్నారో చెప్పాలని ప్రశ్నించారు. ప్రజాసంగ్రామ్ యాత్రలో ప్రజల నుంచి వస్తున్న వినతులపై ప్రభుత్వాన్ని అసెంబ్లీలో నిలదీస్తామని స్పష్టం చేశారు.
అసెంబ్లీ(Telangana assembly sessions 2021)లో అవలంభించాల్సిన విధానాలపై ఎమ్మెల్యేలు రఘునందన్‌రావు, రాజాసింగ్(Bjp Telangana MLAs) చర్చించారు. మిగతా 118 నియోజకవర్గాలకు దళిత బంధు ఎప్పటిలోగా అమలు చేస్తారో చెప్పాలని అడగనున్నట్లు తెలిపారు. తెరాస ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించిన విధంగా నిరుద్యోగ భృతి హామీపై నిలదీస్తామన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై శ్వేతపత్రం విడుదల చేయాలని.. ప్రతి నెల 23 తేదీ వరకు ఆసరా పింఛన్లు ఇవ్వలేని స్థితి ఎందుకు ఏర్పడుతుందో చెప్పాలని కోరనున్నట్లు పేర్కొన్నారు.
"రాష్ట్ర వ్యాప్తంగా దళిత బంధు అమలు చేయాలి. ఇవాళ జరిగే అసెంబ్లీ సమావేశాలకు అంబేడ్కర్ విగ్రహం వద్ద నుంచి పాదయాత్రగా వెళ్తాం. రాష్ట్రంలో గిరిజనులు ఎదుర్కొంటున్న పోడుభూముల వివాదంపై అసెంబ్లీలో ప్రభుత్వాన్ని నిలదీస్తాం. ఈ సమావేశాల్లో ప్రభుత్వాన్ని అడగాల్సిన ప్రశ్నలు చాలా ఉన్నాం. వాటికి వారి దగ్గర సమాధానం ఉందో లేదో చూడాలి."
- తెలంగాణ భాజపా ఎమ్మెల్యేలు