ఒకప్పుడు శిథిలమైన తరగతి గదులు నేడు ఆధునిక హంగులతో ఆకర్షిస్తున్నాయి. వసతులలేమితో సతమతమైన పాఠశాల నేడు అత్యాధునిక వసతులతో ఆహ్వానం పలుకుతోంది. కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా అత్యాధునిక హంగులతో సాదరంగా స్వాగతం పలుకుతోంది సిరిసిల్లలోని జిల్లా పరిషత్ బాలికోన్నత పాఠశాల.
మంత్రి కేటీఆర్ చొరవతో అత్యాధునిక వసతులతో అద్భుతంగా తీర్చిదిద్దారు. రాష్ట్రంలోనే తొలిసారిగా సీఎస్ఆర్ నిధులు, ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంతో సుమారు రూ. మూడు కోట్ల వ్యయంతో అభివృద్ధి చేశారు. సుమారు 1,000 మంది విద్యార్థులు విద్యనభ్యసించేలా... 20 తరగతి గదులు, గ్రంథాలయం, 32 కంప్యూటర్లకు ఇంటర్నెట్ సౌకర్యం కల్పించారు.
400 మంది విద్యార్థులు ఒకేసారి కూర్చొని భోజనం చేసే విధంగా భోజనశాల, బాలికలకు నిరంతరం రక్షణ కల్పించేలా 12 సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. సింథటిక్తో రూపొందించిన క్రీడామైదానం పాఠశాలకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. నేడు మంత్రి కేటీఆర్ ఈ పాఠశాలను ప్రారంభించనున్నారు. రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలన్నీ ఈ విధంగానే మారాలన్నది తన స్వప్నమని మంత్రి కేటీఆర్ ట్విట్టర్లో పేర్కొన్నారు.
ఇదీ చూడండి: ఎత్తు ఏడడుగులు.. తనువెల్లా విరబూసిన పూలు