రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల నియోజకవర్గ కేంద్రంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన రెవెన్యూ చట్టాన్ని స్వాగతిస్తూ.. టెస్కాబ్ ఛైర్మన్ కొండూరు రవీంద్రరావు, రైతుబంధు జిల్లా అధ్యక్షుడు గడ్డం నర్సయ్య ఆధ్వర్యంలో వెయ్యి ట్రాక్టర్లతో ర్యాలీ నిర్వహించారు. నియోజకవర్గంలోని ఎల్లారెడ్డిపేట, ముస్తాబాద్, గంభీరావుపేట, వీర్నపల్లి, తంగళ్ళపల్లి మండలాల ఎంపీపీలు, జెడ్పీటీసీలు, సర్పంచ్లు, ఎంపీటీసీలు, తెరాస నాయకులు భారీ సంఖ్యలో సిరిసిల్ల పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తా వద్దకు చేరుకొని టపాసులు పేల్చి రెవెన్యూ చట్టానికి మద్దతు పలికారు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ రైతు సంక్షేమమే ధ్యేయంగా అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టారని టెస్కాబ్ ఛైర్మన్ కొండురు రవీంద్రరావు అన్నారు. భూ సమస్యలకు పరిష్కరించడానికి కొత్త రెవెన్యూ చట్టం తెచ్చి రైతులకు సత్వర న్యాయం జరిగేలా ముఖ్యమంత్రి ఆలోచన చేశారన్నారు. ఈ కార్యక్రమంలో సిరిసిల్ల నియోజకవర్గంలోని అన్ని మండలాల జెడ్పీటీసీలు, ఎంపీపీలు, ఎంపీటీసీలు, సర్పంచులు, తెరాస నాయకులు తదితరులు పాల్గొన్నారు.