రాష్ట్ర ప్రభుత్వం నిరు పేదలకు పంపిణీ చేసే బతుకమ్మ చీరల డిజైన్లను ప్రతి ఏటా మార్చుతోంది. ఈ ఏడాది పట్టు చీరలను పోలిన డిజైన్లు గల చీరలను పంపిణీ చేయాలని సర్కార్ నిర్ణయించింది. చీరల రంగులు, డిజైన్లను ఈ నెలాఖరులోగా అధికారులు ఖరారు చేయనున్నారు. ఈలోపు రాజన్నసిరిసిల్ల జిల్లా వస్త్రోత్పత్తి దారులు వారికి ఉన్న మరమగ్గాలకు జకాట్ పరికరాలను అమర్చుకునేలా ప్రణాళికలు చేస్తున్నారు.
చెన్నై బాటపట్టిన చేనేత కార్మికులు
చెన్నైలోని సేలం, తిరువూరు, మధురై, మిదాపూర్ తదితర ప్రాంతాల్లోని వస్త్ర ఉత్పత్తులను అక్కడి మరమగ్గాలను సిరిసిల్ల చేనేతకారులు సందర్శిస్తున్నారు. దేశ వ్యాప్తంగా చెన్నై వస్త్రోత్పత్తులకు జాతీయ, అంతర్జాతీయ విపణిలో మంచి డిమాండ్ ఉంది. అక్కడ పూర్తిగా ప్రైవేటు కంపెనీల ఆర్డర్లను ఉత్పత్తి చేస్తుంటారు. బహిరంగ విపణిలో వస్త్రోత్పతులకు ఉన్న డిమాండ్‌కు అనుగుణంగా తరచూ మరమగ్గాలను ఆధునికీకరిస్తారు.
జకాట్తో ఆకర్షణీయ పట్టు డిజైన్లు
తరచూ యంత్రాలను అప్‌గ్రేడ్ చేస్తూ, తమ విక్రయాలను స్వంతంగా విపణిలో విక్రయించేందుకు పోటీపడుతుంటారు. చెన్నైలోని వివిధ ప్రాంతాల్లో పాత జకాట్ పరికరాలను విక్రయిస్తుంటారు. వాటిలో 1200 హుక్స్ నుంచి 240 హుక్స్ వరకు ఉండే జట్లను జిల్లా వస్త్రోత్పత్తిదారులు కొనుగోలు చేస్తున్నారు. వీటిని అమర్చడం వల్ల బతుకమ్మ చీరల ఉత్పత్తిలో పట్టు డిజైన్లు ఆకర్షణీయంగా వస్తాయని చెబుతున్నారు.
జకాట్పైనే బతుకమ్మ చీరల డిజైన్
బతుకమ్మ చీరల ఆర్డర్లు పూర్తిగా జకాట్ పరికరం అమర్చిన వాటిపై మాత్రమే ఉత్పత్తి చేయడం సాధ్యం. కోటి చీరల ఉత్పత్తిలో గతేడాది కేవలం పది లక్షల చీరలను మాత్రమే డాబీ యంత్రాలు అమర్చిన మగ్గాలపై నేశారు. రాష్ట్ర ప్రభుత్వం చేనేత, జౌళిశాల మరమగ్గాల ఆధునికీకరణకు చేస్తున్న ప్రణాళికలేవి కొలిక్కి రాలేదు. కొత్త పరికరాలు కొనుగోలు చేయాలంటే ఒక్కో మరమగ్గానికి రూ. 10 వేల ఖర్చవుతుండటం వల్ల వస్త్రోత్పత్తిదారులు పక్క రాష్ట్రాల్లో వాడిన వాటిని రూ. 6 నుంచి రూ. 8వేలకు కొనుగోలు చేస్తున్నారు.
చెన్నైతో పోటీ
జిల్లా పరిశ్రమలో ఇప్పటికే కొందరు ఆసాములు జకార్డ్ పరికరాలను దిగుమతి చేసుకున్నారు. మరో వారం రోజుల్లో భారీగా జకార్డులు దిగుమతయ్యే అవకాశాలున్నాయి. అక్కడి నుంచి తీసుకొచ్చిన పరికరాలను బిగించే పనిలో యజమానులు, ఆసాములు నిమగ్నమయ్యారు. రాబోయే రోజుల్లో జిల్లా వస్త్రోత్పత్తిదారులు చెన్నైతో పోటీ పడే అవకాశముంది.
- ఇదీ చూడండి : పేదల చెంతకే మెరుగైన ఉచిత వైద్యం: మంత్రి కేటీఆర్