దక్షిణ భారతదేశంలో ప్రసిద్ధ శైవక్షేత్రమైన వేములవాడ రాజన్న ఆలయంలో శివపార్వతుల కల్యాణ వేడుకలు ఘనంగా జరిగాయి. ఉదయం స్వామికి మహన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం చేశారు. ఆలయం ముందు భాగంలో ఎదుర్కోళ్ల కార్యక్రమం నిర్వహించారు. మేళతాళాలు... వేదమంత్రోచ్ఛరణలు... శివనామస్మరణ మధ్య... రాజరాజేశ్వరుల కల్యాణ మహోత్సవాన్ని కన్నులపండువగా జరిపారు.
60 వేల మందికి పైగా భక్తులు స్వామి వారి కల్యాణానికి హాజరైనట్లు ఆలయ అధికారులు తెలిపారు. పురపాలక సంఘం అధ్యక్షురాలు మాధవి ఆధ్వర్యంలో కౌన్సిలర్లు, అధికారులు ర్యాలీగా వచ్చి స్వామివారికి పట్టువస్త్రాలను సమర్పించారు. పలువురు జోగినులు రాజన్నను ఊహించుకుంటూ పెళ్లి చేసుకుంటారని అధికారులు తెలిపారు. భక్తుల రద్దీ దృష్ట్యా అధికారులు ఆలయంలో ఆర్జిత సేవలను రద్దు చేశారు. కొవిడ్ నిబంధనలు పాటిస్తూ భక్తులు స్వామి వారిని దర్శించుకున్నారు.