రెండు పడక గదుల ఇళ్లు అర్హులకు కాకుండా అనర్హులకు మంజూరు చేశారంటూ రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం సారంపల్లి గ్రామస్థులు ఆందోళనకు దిగారు. తహసీల్దార్ కార్యాలయం ఎదుట సిరిసిల్ల-సిద్దిపేట ప్రధాన రహదారిపై బైఠాయించి ధర్నా నిర్వహించారు. మొదట ప్రకటించిన జాబితాలో ఉన్న పేర్లు కాకుండా రెండో జాబితాలో కొత్తవారి పేర్లు ఎలా వచ్చాయంటూ అధికారులను ప్రశ్నించారు. ఇప్పటికైనా గ్రామాల్లో మళ్లీ సర్వే చేయించి నిజమైన అర్హులకు రెండు పడక గదుల ఇళ్లు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు.
విషయం తెలుసుకున్న సీఐ ఉపేందర్, ఎస్సై లక్ష్మారెడ్డిలు ఘటనా స్థలానికి చేరుకొని ఆందోళనకారులను శాంతింపజేశారు. అనంతరం గ్రామస్థులు తహసీల్దార్‌కు వినతిపత్రం అందజేశారు.