free buses in vemulawada: రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన వేములవాడ శ్రీ రాజరాజేశ్వరస్వామి ఆలయంలో ఉచిత బస్సు సేవలను ఎమ్మెల్యే రమేశ్ బాబు, జడ్పీ ఛైర్మన్ న్యాలకొండ అరుణ, ఈవో రమాదేవి కలిసి ప్రారంభించారు. మహాశివరాత్రి ఉత్సవాలకు తిప్పాపురం బస్టాండ్ నుంచి ఆలయ పరిసర ప్రాంతాల వరకు బస్సులు తిరుగుతాయని వెల్లడించారు.
శివరాత్రి జాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఆర్టీసీ ఆధ్వర్యంలో 14 షటిల్ బస్సులు ఉచితంగా సేవలు అందించనున్నట్లు వెల్లడించారు. ఆలయాన్ని విద్యుత్ కాంతులు, పూలమాలలతో అని రకాల హంగులతో సుందరంగా తీర్చిదిద్దినట్లు తెలిపారు.
ఉచిత అల్పాహార కేంద్రం
వేములవాడ మహాశివరాత్రి జాతరకు వచ్చే భక్తుల సౌకర్యార్థం ఉచిత అల్పాహార కేంద్రాన్ని కూడా ప్రారంభించారు. సోమవారం సాయంత్రం 700 మంది కళాకారులతో శివార్చన కార్యక్రమం ఘనంగా నిర్వహించడం జరుగుతుందని ఎమ్మెల్యే తెలిపారు. మహాశివరాత్రి సందర్భంగా సుమారు లక్ష మంది భక్తులు హాజరయ్యే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేసినట్లు ఆలయ ఈవో రమాదేవి తెలిపారు.
వేములవాడ జాతరలో ఆర్టీసీ పాత్ర చాల గొప్పది. ప్రజలను తరలించడంలో ప్రతి ఏటా కృషి చేస్తున్నారు. ఈసారి కూడా 770 బస్సులు కేటాయించడం జరిగింది. అంతే కాకుండా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా 14 షటిల్ బస్సులు ఉచితంగా ఏర్పాటు చేయడం జరిగింది. వేములవాడకు వచ్చే భక్తులకు ఎలాంటి సమస్యలు రాకుండా అన్నదానాలు, క్యూలైన్లలో వసతులు కల్పించారు. ఆలయ ఈవో సారథ్యంలో శివరాత్రికి అన్ని రకాల ఏర్పాట్లు చేశాం.- రమేష్ బాబు, ఎమ్మెల్యే
మహాశివరాత్రి జాతర శోభ
జాతరకు వచ్చే భక్తులకు రూ.1.81 కోట్లతో అధికారులు భారీగా ఏర్పాట్లు చేశారు. సోమవారం నుంచి మూడు రోజుల పాటు మహాశివరాత్రి వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహించడానికి సర్వం సిద్ధమైంది. భక్తులు రద్దీకి అనుగుణంగా అధికారులు వసతులను ఏర్పాటు చేశారు. ఆలయాన్ని విద్యుత్ కాంతులతో సర్వాంగ సుందరంగా ముస్తాబు చేశారు. ప్రత్యేక అలంకరణలు, స్వాగత తోరణాలు ఆకట్టుకుంటున్నాయి. తెలంగాణ సంస్కృతికి, ఆధ్యాత్మికతకు అద్దం పట్టేలా వేడుకలను నిర్వహించనున్నారు. గుడి చెరువులో సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో శివార్చన కార్యక్రమ నిర్వహణకు వేదిక సిద్ధం చేశారు. భక్తులు స్వామివారిని దర్శించుకునేందుకు ప్రత్యేక క్యూలైన్లు ఏర్పాటు చేశారు. 3 లక్షల లడ్డూ ప్రసాదాలను సిద్ధంగా ఉంచారు. ఆలయ పరిసరాల్లో చలువ పందిళ్లు, షామియానాలు ఏర్పాటు చేశారు. భక్తులకు పార్కింగ్ స్థలంలో తాత్కాలిక మరుగుదొడ్లు, జల్లు స్నానాల నల్లాలు ఏర్పాటు చేశారు. క్యూలైన్లలోని భక్తులకు శుద్ధజలం, నీటి ప్యాకెట్లు, మజ్జిగ ప్యాకెట్లు అందించనున్నారు.