ఇటీవల కామెర్ల వ్యాధితో మరణించిన శ్రీధర్ కుటుంబానికి రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ అండగా నిలిచారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం బొప్పపూర్ గ్రామానికి చెందిన శ్రీధర్, జ్యోతి దంపతులకు ఇద్దరు కవల పిల్లలు (18నెలలు) ఉన్నారు. ఆ దంపతులు ఇద్దరు కూలి పని చేసుకుంటూ ఒక అద్దె ఇంట్లో నివాసం ఉంటున్నారు. ఇటీవల శ్రీధర్ కామెర్ల వ్యాధితో మరణించాడు. ఇంటి పెద్ద శ్రీధర్‌ను కామెర్ల వ్యాధి పొట్టన పెట్టుకోగా.. ఆ ఇల్లాలు తన 18 నెలల కవల పిల్లలతో దిక్కుతోచని పరిస్థితుల్లో పడిపోయింది.
ఈ విషయం తెలుసుకున్న రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే మానవతా దృక్పథంతో ముందుకు వచ్చి ఆ కుటుంబాన్ని ఆదుకోవడానికి తన వంతు సహాయంగా 50వేల రూపాయల చెక్కు, 100కిలోల బియ్యం, పిల్లలకు కట్టుకోవడానికి బట్టలను వారికి అందజేశారు. అభం శుభం తెలియని చిన్నపిల్లలు ఇంత చిన్న వయసులోనే తండ్రిని కోల్పోవడం చాలా బాధాకరంగా ఉందని ఎస్పీ అన్నారు. వారికి అన్నివేళలా అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ చంద్రశేఖర్, సీఐ బన్సీలాల్, ఎస్సై వెంకటకృష్ణ, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
ఇవీ చూడండి: 'ఎకో టీ కాలింగ్' పుస్తకాన్ని ఆవిష్కరించిన కేటీఆర్