Rainy seasons Problems In Sircilla : సిరిసిల్ల అధికార యంత్రాంగం గత వరదల నుంచి... ఎలాంటి పాఠాలు నేర్చుకోలేదన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది. మూడు పర్యాయాలు సిరిసిల్ల పట్టణంలోకి వరద నీరు వచ్చి ముంపునకు గురిచేసింది. గతేదాడి కురిసిన వర్షాలు సిరిసిల్ల ప్రజలకు చేదు అనుభవాలను మిగిలచ్చాయి. సిరిసిల్ల నీటిలో మునగడానికి ప్రధానంగా.. కాలువలు, నాలాలు ఆక్రమించడమేనని అధికారులు తేల్చి ముంపునకు గురికాకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని తలపెట్టారు. దానికి గాను దాదాపు 6.20కోట్ల రూపాయలు కేటాయించారు.
కాల్వ పూల్చడంతో : ప్రధాన కారణమైన బోనాల శివారులో మొదలైన కాలువ.. సుమారు 100 మీటర్ల వెడల్పు ఉంటే అక్రమార్కులు పూడ్చివేయడంతో వెంకంపేట, ధోబీఘాట్‌కు చేరేసరికి అది కాస్తా 2 0మీటర్ల వెడల్పుకు తగ్గిపోయింది. దీంతో వంద మీటర్ల కాలువలో నుంచి వచ్చిన వర్షపు నీరు సింహభాగం రోడ్లపైనే ప్రవహించాల్సిన దుస్థితి ఏర్పడింది. అయితే ఆ వరద నీరంతా రోడ్డెక్కి ఇళ్లలోకి రావడంతో.. వెంకంపేట, అశోక్‌నగర్, జయప్రకాశ్‌నగర్, అంబికానగర్, సంజీవయ్యనగర్, పాతబస్టాండ్, ఆసిఫ్‌పుర, శ్రీనగర్ కాలనీలు వరద నీటిలో మునిగిపోయాయి. ఈ కాలువ ద్వారా వచ్చిన వరద నీరు కొత్తచెరువుకు చేరుకొని నాలాల ద్వారా దామెరకుంటకు చేరాల్సి ఉంటుంది.
నాలా ఆక్రమణ స్థలాల్లో ప్లాట్లు : కొత్త చెరువు కింద ఉన్న నాలాలు ఆక్రమణకు గురై.. ప్లాట్లుగా మారిపోయాయి. కొన్నిచోట్ల వాటిపై భవనాలు నిర్మించారు. దీంతో నాలాలు పూర్తిగా మూసుకు పోవడంతో... చెరువులో నుంచి ఉప్పొంగిన నీరు రోడ్డెక్కి శాంతినగర్‌లోకి చేరడంతో దాదాపు 4 వేల ఇళ్లలో నీళ్లు చేరాయి. ఫలితంగా కోట్లలో నష్టం వాటిల్లింది. గతేడాది ముంపునకు గురైన ప్రాంతాలను పరిశీలించిన అధికారులు.. ఆక్రమణలను తొలగిస్తామని చెప్పడమే తప్ప రాజకీయ ఒత్తిళ్లు ఇతరత్రా కారణాలతో అమలులో ఎనలేని నిర్లక్ష్యం కనిపిస్తోంది. 1.80 మీటర్ల ఎత్తు ఉన్న కాలువను 3 మీటర్లకు పెంచాలని, కాల్వలపై అక్రమ నిర్మాణాలు తొలగించాలన్న ప్రణాళిక రూపొందించారు. కానీ ఆక్రమణల తొలగింపు మాత్రం.. నామమాత్రంగా సాగుతోంది. నేరుగా వెళ్లాల్సిన కాల్వ కాస్తా వంకలు తిరుగుతోంది.
ఇళ్లోలోకి నీరు : బోనాల శివారు నుంచి పెద్ద చెరువుకు చేరే.. దాదాపు 5 కిలోమీటర్ల మేర ఉన్న కాల్వ ఆక్రమణకు గురై కుచించుకు పోగా.. వర్షపు నీరు ఇళ్లలోకి రోడ్లపైకి వచ్చి ప్రళయం సృష్టిస్తోంది. వర్షపు నీటితో ఇళ్లు మునిగిపోవడానికి కారణాలేమిటో తెలుసుకున్న అధికారులు.. అక్రమ నిర్మాణాలను తొలగిస్తామని దాదాపు 1500 ఇళ్లు తొలగించేందుకు గతేడాది మార్కింగ్ పూర్తి చేశారు. అయితే చెప్పినంత వేగంగా పనులు చేపట్టక పోవడంతో సమస్య పునరావృత్తం అయ్యే అవకాశాలు ఉన్నాయని.. స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ధోబీఘాట్ నుంచి కాల్వపద్మనగర్, అంబికానగర్, అశోక్‌నగర్, సంజీవయ్యనగర్ మీదుగా కొత్త చెరువు వరకు నిర్మించాల్సి ఉంది. అయితే పనుల్లో జాప్యం కారణంగా కాల్వల్లో మొక్కలు సైతం మొలుస్తున్నాయి. అధికారులు వెంటనే పనులు చేపట్టి.. వర్షాకాలం నాటికి పూర్తి చేయాలని కోరుతుండగా.. గుత్తేదారుపై చర్యలు తీసుకొని వెంటనే చేపడతామని మున్సిపల్ కమిషనర్ సమ్మయ్య తెలిపారు. నత్తనడకన సాగుతున్న పనులను వెనువెంటనే చేపట్టాలని.. మరో 20 రోజుల్లో వర్షాకాలం రానున్నదని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చేతులు కాలాక ఆకులు పట్టుకొనే కంటే.. ముందుగానే తగుచర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.
ఇవీ చదవండి: