రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల అర్బన్ మండలం చంద్రంపేట, రగుడు గ్రామాల్లో కురిసిన అకాల వర్షం వల్ల రైతులకు తీవ్ర నష్టం వాటిల్లింది. మంగళవారం సాయంత్రం ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం వల్ల ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో నిల్వ ఉంచిన వరిధాన్యం తడిసి ముద్దయింది. ఈదురుగాలులకు మామిడి కాయలు రాలిపోవడం వల్ల మామిడి రైతులు నష్టపోయారు. రగుడు గ్రామంలో ఈదురు గాలులకు ఇంటిపై వేసిన రేకులు లేచిపోయి దూరంగా పడిపోయాయి. గ్రామంలో ఉన్న విద్యుత్ స్తంభాలు విరిగిపోయి విద్యుత్ సరఫరా నిలిచిపోయింది.
కరెంట్ స్తంభాలు విరిగి ఇంటి పై కప్పుపై పడడం వల్ల పెను ప్రమాదం తప్పింది. ఇంకా చాలా కరెంట్ స్తంభాలు కూడా విరిగే స్థితిలో ఉన్నాయి. కావున సెస్ అధికారులు వెంటనే ఆ స్తంభాల స్థానాల్లో కొత్తవి వేయాలని గ్రామస్థులు కోరుతున్నారు. అలాగే ఆరుగాలం పండించిన పంట నీటి పాలు కావడం వల్ల రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. అకాల వర్షంతో నష్టపోయిన అన్నదాతలను ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు.
ఇవీ చూడండి: వర్షంతో ఒక్కసారిగా చల్లబడిన హైదరాబాద్ నగరం