పురపాలక, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్.. సిరిసిల్ల, చొప్పదండి నియోజకవర్గాల్లో పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల బొప్పాపూర్, గొల్లపల్లిలో మంత్రి ప్రశాంత్‌రెడ్డితో కలిసి రెండు పడక గదుల ఇళ్లను ప్రారంభించారు. 260 మంది లబ్ధిదారులకు పట్టాలు అందించారు. గృహప్రవేశాలు చేసినవారికి కొత్త వస్త్రాలు పెట్టి.. సహపంక్తి భోజనం చేశారు. పేదల ఆత్మగౌరవాన్ని పెంపొందించేలా.. లంచం అనే మాట లేకుండా... అత్యంత పారదర్శకంగా పేదలకు ఇళ్లు అందుతున్నాయని కేటీఆర్ స్పష్టం చేశారు. ఇళ్లు రానివారు ఆందోళన చెందవద్దని... అర్హులందరికీ ఇళ్లు కట్టించి ఇస్తామని హామీ ఇచ్చారు. ఒకప్పుడు దుర్భిక్ష ప్రాంతంగా ఉన్న సిరిసిల్ల... కాళేశ్వరం జలాలతో సిరిసిల్ల కోనసీమలా మారబోతోందని రోడ్లు, భవనాల శాఖ మంత్రి ప్రశాంత్‌రెడ్డి తెలిపారు.
అమ్మమ్మ, తాతయ్య జ్ఞాపకార్థం రైతు వేదిక
అనంతరం.. సిరిసిల్లలో ఆర్అండ్బీ అతిథిగృహం నిర్మాణానికి మంత్రి ప్రశాంత్‌రెడ్డితో కలిసి కేటీఆర్ భూమిపూజ చేశారు. ఆర్డీవో కార్యాలయం వద్ద డయాగ్నోస్టిక్ సెంటర్ ప్రారంభించారు. అనంతరం బోయిన్‌పల్లి మండలం కొదురుపాకలో అభివృద్ధి పనులు ప్రారంభించారు. ఒద్యారం వరకు 4 వరుసల రహదారి పనులు సహా విలాసాగర్‌లో ఎత్తిపోతల పథకానికి శంకుస్థాపన చేశారు. కొదురుపాకలో అమ్మమ్మ, తాతయ్య జ్ఞాపకార్థం కేటీఆర్ కట్టించిన రైతు వేదికను ప్రారంభించారు. రైతులను సంఘటితం చేసి మార్కెట్‌ను శాసించే స్థాయికి చేర్చాలనేదే లక్ష్యమని కేటీఆర్స్పష్టం చేశారు. మిడ్‌మానేరు నిర్వాసితుల సమస్యలు సహా అన్నింటిని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తామని మంత్రి కేటీఆర్ హామీ ఇచ్చారు.
ఇదీ చదవండి: కృష్ణా జలాల విభజన త్వరగా చేపట్టాలని కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం లేఖ